Munugodu Bypoll: మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు, ఎత్తులు పై ఎత్తులతో కాంగ్రెస్-టీఆర్ఎస్-బీజేపీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. సిట్టింగ్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంటే..అదే స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ అభ్యర్ధి పావులు కదుపుతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఈసారైనా పరువు నిలుపుకునేందుకు శ్రమిస్తోంది.
కంచుకోట కాంగ్రెస్‌దా, రాజగోపాల్ రెడ్డిదా
వాస్తవానికి మునుగోడు కాంగ్రెస్ పార్టీకు కంచుకోటగా చెప్పవచ్చు. 2018 ఎన్నికల్లో రాష్ట్రమంతా కేసీఆర్ హవా వీచినా మునుగోడులో మాత్రం అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 28 వేల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తరువాత పార్టీలో విబేధాలతో, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సరిపడకపోవడం వంటి వివిధ కారణాలతో ఇటీవలే రాజీనామా చేసి..బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకునేందుకు కాషాయం తరపున పోటీ చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. ఇప్పటి వరకూ మునుగోడులో కాంగ్రెస్ పార్టీకు ఉన్న ఆధిపత్యం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. రాజగోపాల్ రెడ్డిని చూసి జనం కాంగ్రెస్ వైపున్నారా లేదా కాంగ్రెస్ పార్టీని చూసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించారా అనేది ఇప్పుడీ ఎన్నికల్లో తేలిపోనుంది. ఈ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్ధి కంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే సవాలుగా మారనుంది. మునుగోడు చేజారితే..రేవంత్ రెడ్డి పీసీసీ పదవి ప్రశ్నార్ధకం కావచ్చనే సందేహాలు కూడా విన్పిస్తున్నాయి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎటున్నారో మరి
మునుగోడు బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు పార్టీకు షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అందరూ ఆశిస్తున్న క్రమంలో..ఈ నెల 15వ తేదీన కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. తిరిగొచ్చేది ఉప ఎన్నికల ఫలితాల తరువాతే. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం సోదరుడి ఉప ఎన్నికకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే విదేశీ పర్యటన ప్లాన్ చేసుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి సహా పలువులు నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారంపై పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి.
తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఈ సందర్భంగా సంచలనమైంది. కాంగ్రెస్ పార్టీకు చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ మారుతున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి చేసిన ఈ ట్వీట్‌పై ఆయన స్పందించారు కూడా. ఇదంతా రాజకీయ జిమ్మిక్కని తిప్పికొట్టారు. కాంగ్రెస్‌లో ఐక్యత ఉందని వ్యాఖ్యానించారు. అటు మల్లు భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతలు కూడా కోమటిరెడ్డిపై సానుకూల ప్రకటనలే ఇచ్చారు. కోమటిరెడ్డి ఇచ్చిన ప్రకటనతో పార్టీ మారరని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో విదేశీ పర్యటన ప్లాన్ చేయడం కాంగ్రెస్ వర్గాలు మింగుడు పడటం లేదు. సోదరుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా తప్పించుకునేందుకే ఫారిన్ టూర్ ప్లాన్ చేశారని కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది.
ఇటు బీజేపీలో చేరనని చెబుతూనే..ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండటంపై కాంగ్రెస్ వర్గాల్లో అసహనం రేగుతోంది. కోమటిరెడ్డి ఎటువైపున్నారనేది అర్ధం కావడం లేదు. కాంగ్రెస్‌కు ప్రచారం చేయరు. కాంగ్రెస్‌లోనే ఉన్నానంటూ వ్యాఖ్యలు చేస్తారు.
టీఆర్ఎస్ పరువు నిలిచేనా
మునుగోడు ఉపఎన్నిక నేపధ్యంలో కాంగ్రెస్‌లో ఉన్న గందరగోళాన్ని అనుకూలంగా మల్చుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. మరోసారి హుజూరాబాద్ పరిస్థితి ఎదురు కాకూడదని టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అదే జరిగితే తెలంగాణలో బీజేపీకు మరింత పట్టు పెరుగుతుంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మునుగోడులో పరువు కాపాడుకోలేకపోతే..అధికార పార్టీకు కచ్చితగా మైనస్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.
Also read: Komatireddy Venkat Reddy: మంత్రి కేటీఆర్‌పై కోమటిరెడ్డి సెటైర్లు.. మరి నీ సిస్టర్ సంగతేంటని ఎద్దేవా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Munugodu Bypoll: మునుగోడులో ఏం జరుగుతోంది, కోమటిరెడ్డి ఎటువైపు, విదేశీ పర్యటన మర్మం