Pitlam Tehsildar Unfurls National Flag Upside Down: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయంలో జాతీయ జండాకు అవమానం జరిగింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ ఆగస్టు 15న జరిగిన వేడుకల్లో పిట్లం తహాసిల్దార్ జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి జాతీయ జండా పట్ల తన నిర్లక్ష్యన్ని ప్రదర్శించుకున్నారు. జాతీయ జండాలో పైన ఉండాల్సిన కాషాయపు వర్ణాన్ని తలకిందులు చేస్తూ జండాని ఎగురవేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థిని, విద్యార్థుల సాక్షిగా జాతీయ జెండాకు ఈ అవమానం జరిగింది.
ఏకంగా తహశీల్దార్ స్థాయి అధికారి ఈ తప్పిదానికి పాల్పడటంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ ఉన్న వారు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. తహశీల్ధార్ తప్పు చేస్తున్నారా ? లేక తామే ఏమైనా పొరపడుతున్నామా అని సందిగ్ధానికి గురయ్యారు. సమాజంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, జవాబుదారీగా ఉండాల్సిన రెవిన్యూ అధికారే స్వయంగా ఈ పొరపాటు చేయడమే అందుకు కారణమైంది.
ఇదిలావుంటే, ఇదే కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలో ఉన్న ఇందిరా క్రాంతి పథకం కార్యాలయంలోనూ ఇదే సీన్ రిపీటైంది. 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జరిగిన వేడుకల్లో ఏపిఓ నిర్లక్ష్యం కారణంగా జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఏపిఓ నిర్లక్ష్యంతో తలకిందులుగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జండాపై తనకు ఉన్న గౌరవం, దేశభక్తి ఏపాటిదో చాటుకున్నారు.
పిట్లం మండలంలో అక్కడి తహశీల్దార్ కార్యాలయంలో, అలాగే మద్నూర్ మండలంలో ఇందిరా క్రాంతి పథకం కార్యాలయంలో జరిగిన ఘటనలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎందరో మహానుభావులు త్యాగదనులు తమ జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెడితే.. అలాంటి వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన సమయంలో ఇలాంటి వ్యక్తుల కారణంగా జాతీయ జెండాకు అవమానం జరగడం పట్ల ప్రత్యక్షసాక్షులుగా అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు సిగ్గుతో తలదించుకొని వెనుదిరిగి పోయారు.
మండల మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్న తహాసిల్దారే జాతీయ జెండా ను అవమానం చెయ్యడంతో జాతీయ జెండాకు రక్షణ కల్పించాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడంతో ఇక ఎవరు, ఎవరిపై చర్యలు తీసుకోవాలనో తెలియడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజా సంఘాల నేతలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. జాతీయ జండాను ఎవరు అవమానించినా, ఎలా అవమానించినా అది పెద్ద నేరమే అవుతుంది. మరి ఈ రెండు ఘటనల్లో అక్కడి పోలీసులు, జిల్లా అధికారులు ఎలా వ్యవహరిస్తారో వేచిచూడాల్సిందే మరి.