తెలంగాణలో అసెంబ్లీని రద్దుచేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన చేతకాని తనాన్ని బయటపెట్టుకున్నారని.. ఆయనను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి నుండి వెంటనే తొలిగించాలని తాము డిమాండ్ చేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ తెలిపారు. ఈ మేరకు తాము గవర్నరుని కలుస్తామని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో రాష్ట్రపతి పాలనే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పాలన మీద తమకు నమ్మకం ఉంటే సీఎం అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఏముందని కోదండరామ్ ప్రశ్నించారు.
కేసీఆర్ అనేకసార్లు అధికార దుర్వినియోగం చేశారని.. అలాగే ఎన్నో అవినీతి చర్యలకు పాల్పడ్డారని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రభుత్వమని.. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేని ప్రభుత్వమని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించడం సరికాదని... ఆయన చేస్తున్న కుటిల రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోదండరామ్ తెలిపారు.
ఇటీవలే కోదండరామ్ తెలంగాణ జన సమితి తరఫున త్వరలోనే 25 నియోజకవర్గాల్లో ఇంటింటికి జనసమితి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ సదస్సులు నిర్వహించి తీరుతామని ఆయన అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జనసమితి కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపుతుందని.. ఇప్పటికే ఎన్నికల గుర్తు కోసం ఎలక్షన్ కమీషనుకి దరఖాస్తు చేశామని ఆయన అన్నారు.