Prashanth Kishore, Rahul Gandhi News : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చలు జరపడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోనియా గాంధీతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించడంతో .. పీకే కాంగ్రెస్ లో చేరడం ఖాయమని అంతా భావించారు. కాని పాత సీనే మళ్లీ రిపీటైంది. హస్తం కండువా కప్పుకునేందుకు ప్రశాంత్ కిషోర్ వెనుకంజ వేశాడు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగేలా కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడి అవసరం ఉందంటూ పీకే చేసిన ట్వీట్ కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతోంది. పీకే ట్వీట్ తో కాంగ్రెస్ పరువు గంగలో కలిసిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తోంది.
అయితే సోనియాతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలతో పీకే సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొనలేదు. అత్యంత కీలకంగా భావించిన సమావేశానికి రాహుల్ ఎందుకు రాలేదన్నది చర్చగా మారింది. 2024 ఎన్నికల కోసం పీకే ప్రజెంటేషన్ ఇవ్వగా.. రాహుల్ ఆ సమావేశంలో లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. రాహుల్ గాంధీ.. పీకే సమావేశానికి రాకపోవడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. పీకే కాంగ్రెస్ లో చేరరని రాహుల్ ముందుగానే ఊహించారని, అందుకే ఆ సమావేశాలకు డుమ్మా కొట్టారని చెబుతున్నారు.
కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరడని రాహుల్ గాంధీ గతంలోనే చెప్పేశారని తెలుస్తోంది. గతంలోనూ కాంగ్రెస్ నేతలతో పీకే చర్చలు జరిపారని అంటున్నారు. అప్పుడు కూడా పీకే కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని భావించారు. కాని పీకే మాత్రం కాంగ్రెస్ కు డ్యామేజ్ కలిగేలా కామెంట్లు చేశారు. అందుకే తాజాగా కాంగ్రెస్ నేతలతో పీకే సమావేశాలకు రాహుల్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదని కొందరు ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. పార్టీలో చేరిక గురించి కాకుండా వచ్చే ఎన్నికల రూట్ మ్యాప్ కోసం ప్రజెంటేషన్ ఇస్తాననే పీకే చెప్పారని కూడా కొందరు అంటున్నారు. రాహుల్ తనపై ఆసక్తి చూపడం లేదని గ్రహించిన పీకే.. ప్రియాంక ద్వారా రాయబారం నడిపారనే టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది.
పీకే ఎపిసోడ్ పై కాంగ్రెస్ లో మరో చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేస్తూనే ఇతర రాష్ట్రాల్లో మిగితా పార్టీలకు పని చేయడాన్ని సీనియర్లు వ్యతిరేకించారని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ విషయంలోనే పెద్ద చర్చ జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ కు వ్యహకర్తగా ఉన్నారు పీకే. కేసీఆర్ కోసం ఆయన టీమ్ ఇప్పటికే సర్వేలు చేస్తోంది. అటు కాంగ్రెస్ కూడా తెలంగాణపై ఫోకస్ చేసింది. కేసీఆర్ సర్కార్ పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమనే ధీమాలో టీపీసీసీ నేతలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పీకేతో తమకు ఇబ్బంది అవుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారట. టీఆర్ఎస్ తో కటీఫ్ చేసుకోవాలని పీకేకు సూచించారట. అందుకే పీకే అంగీకరించలేదని.. ఇదే ఆయన కాంగ్రెస్ లో చేరికకు అడ్డంకిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీని వాడుకుని... మిగితా పార్టీలకు ప్రయోజనం కలిగేలా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నారనే వాదనను కొందరు ఏఐసీసీ నేతలు తెచ్చారని తెలుస్తోంది. మొత్తంగా పీకే ఎపిసోడ్ తర్వాత.. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరరని రాహుల్ గాంధీ ఊహించింది నిజమైందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
READ ALSO: Patnam Mahender Reddy: మహేందరా ఏందీ నీ బూతుపురాణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.