CM REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావొస్తోంది. డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా సంబరాలు జరపాలని రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. నవంబర్ 14 జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రారంభమైన విజయోత్సవాలు.. డిసెంబర్ 9 దాకా జరగనున్నాయి. దాదాపు 26 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు.. ఈ ఏడాది పాలనను వేలాదిమంది కళాకారులతో పలు స్టేజీ షోలు ఏర్పాటు చేసి అంబరంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సంబరాల పూర్తి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. అయితే సంబరాలకు సంబధించి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావులతో భట్టి విక్రమార్క సమావేశం ఏర్పాటు చేసి ఏడాది పాలనపై ఇటీవల చర్చలు జరిపారు.
ఇక కాంగ్రెస్ ఏడాది పాలన సంబరాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే గోషామహల్‌లోని ఉస్మానియా ఆసుపత్రి, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటికి శంకుస్థాపన చేయబోతున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భట్టి విక్రమార్క తెలిపారు. గ్రూప్ -4 ఉద్యోగాల ఎంపికని పూర్తిచేసి ఏడాది సంబరాలలోనే అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. 26 రోజుల పాటు జరగనున్న ఈ సంబరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన హామీలను తెలంగాణ ప్రజలలోకి విసృతంగా తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది. మహిళలకు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 18 వేల కోట్లతో చేసిన 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500లకే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగులకు ప్రకటించిన 50 వేల ఉద్యోగాలు, ఇందిరా మహిళా శక్తి, 20 వేల కోట్లతో మహిళా సంఘాలకు కేటాయించిన వడ్డీ లేని రుణాలు వంటివి ఈ సంబరాలలో రాష్ట్ర ప్రజలకు వివరించేలా ప్రదర్శనలు చేయనున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఏడాది పాలన సంబరాలపై ప్రతిపక్షాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. మహిళలకు కేటాయించిన ఉచిత బస్సు ప్రయాణం తప్పా, మిగతా ఏ హామీని అమలు చేయకుండా ఎలా సంబరాలు జరుపుకుంటారని ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. గత సంవత్సరం పాటుగా కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులకు గురయిన పలు రంగాల వారికి సమాధానాలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల పొట్ట కొట్టారు. వారి బతుకులు అంధకారంలోకి వెళ్లేలా చేసి, వారికి ఇస్తానన్న డబ్బులు ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో ఆటో కార్మికులు ధర్నాలు చేసేవరకు వచ్చేలా చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని విమర్శిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రకటించిన ఉద్యోగాలను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియామక పత్రాలు ఇచ్చి వారి ఖాతాలో వేసుకుని నిరుద్యోగ విద్యార్థులకు మీ ముఖాలు ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూసీ ప్రక్షాళన, హైడ్రా వల్ల ఇళ్లు కోల్లోయిన పేద మధ్య తరగతి వాళ్లకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాయి.
ఇక అధికారంలోకి రాగానే పేద ప్రజలకు సొంతింటి కల నేరవేరుస్తామని హామీ ఇచ్చి, ఉండటానికి ఇళ్లు లేకుండా చేసినందుకు సంబరాలు చేస్తున్నారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పోలీసులతో పోలీసులను కొట్టించిన ప్రభుత్వాన్ని చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చూసుండరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. కానీ ఈ హామీ ఇంకా నెరవేరలేదు. ప్రస్తుతం వారి ప్రశ్నలను లేవదీస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తెలంగాణలో ఏడాదిపాటు పేద ప్రజలను మోసం చేసినందుకు రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మొత్తంగా కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల నుంచి కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికారంలోకి రాగానే మహిళలకు ఇస్తానన్న 2500 ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు. వృద్ధులకు, వితంతువులకు 2 వేల నుంచి 4 వేలు చేస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చలేదు. బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు కూడా ఇవ్వలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా చేయలేదు. సన్న బియ్యాలకు ఇస్తానన్న బోనస్ ఇప్పటివరకు ఇవ్వలేదు. వానాకాలం పంటలకు ఇచ్చే రైతుబందుని ఇప్పటివరకు ప్రకటించకపోవడం పట్ల తెలంగాణ రైతాంగం నుంచి చాలా వ్యతిరేకతని కాంగ్రెస్ ప్రభుత్వం మూటకట్టుకుంది. ఇటీవల రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో లగచర్ల గ్రామంలో కలెక్టర్ పై దాడి కేసులో రైతుల అరెస్టు పట్ల రైతుల నుంచి ఆగ్రహాన్నికి గురయింది. వ్యవసాయానికి అనువైన పంటపొలాలను ఫార్మా కంపెనీకి అప్పజెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలు రైతు సంఘాలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వీటన్నింటిని ఏం లెక్కచేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాది పాలన సంబరాలు జరిపేందుకు సిద్దమైన్నట్టు తెలుస్తోంది.
Also Read:Smitha Sabharwal: స్మితా సబర్వాల్ గుడ్ బై!
Also Read: YS JAGAN: జంపింగ్‌లపై కొత్త అస్త్రం.. రాజన్న బాటలో జగనన్న!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.