Revanth Reddy about September 17th History: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాబోయే రోజుల్లో తెలంగాణ ముఖచిత్రం ఎలా ఉంటుందనే అంశంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సెప్టెంబర్ 17 నుండి సరికొత్త తెలంగాణ ఆవిష్కరిస్తామన్న ఆయన.. వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ TS ను తొలగించి ఆ స్థానంలో TG తీసుకొస్తాం అని రేవంత్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చే మార్పుల గురించి ప్రస్తావిస్తూ.. అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాం అని అన్నారు. అంతేకాకుండా దొరలు తీర్చిదిద్దిన దొరల తెలంగాణ తల్లిని కాకుండా ఆ స్థానంలో సబ్బండ వర్గాల తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తాం అని అన్నారు. గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్త్కృత స్థాయి సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపి, టీఆర్ఎస్ అసలు చరిత్రను దాచిపెడుతున్నాయి..
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం చరిత్ర గురించి గుర్తుచేసుకుంటూ.. ''ఆనాడు తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలో ఉండగా కాంగ్రెస్ పార్టీ కృషితో తెలంగాణకు స్వేచ్చ లభించింది'' అని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. అసలు చరిత్రను దాచిపెట్టి బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు చరిత్రను తమకు అనుకూలంగా మల్చుకుంటూ మత విద్వేషాలు సృష్టించే కుట్ర చేస్తున్నాయని అన్నారు. బీజేపి, టీఆర్ఎస్ పార్టీల కుట్రపూరిత వైఖరితో జనాన్ని తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని.. జనం అప్రమత్తతో ఉండాల్సిన సమయం ఇది అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఆత్మగౌరవం చాటేలా ప్రత్యేక జెండా..
జాతీయ జెండాతో పాటు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ప్రత్యేక జెండాను ఎగురవేస్తాం అని చెప్పి తెలంగాణ ప్రజానికంలో ఆసక్తిని రేకెత్తించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కప్పిన మబ్బులను తొలగించి వాస్తవ చరిత్ర ప్రజలకు అర్థమయ్యేలా చాటిచెబుతాం అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఫలాలు అందరికీ అందేలా పరిపాలనలో, అధికార యంత్రాంగంలో సమూల మార్పులు తీసుకొస్తాం అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
మునుగోడు ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి విజయం కోసం కృషి..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్త్కృత స్థాయి సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'మునుగోడు ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి విజయం కోసం కృషి చేయాల్సిందిగా' రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే ప్రత్యేక కార్యక్రమాలతో పాటు మునుగోడు ఉప ఎన్నిక విషయంలో అవలంభించాల్సిన తీరు, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిర్వహణ తదితర అంశాల గురించి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అటు పార్టీ శ్రేణులకు, ఇటు మీడియాకు వివరించారు.
Also Read : Kcr vs Jagan: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ జోరు..ఏపీలో జగన్‌తో ఇక సమరమేనా..?
Also Read : Kishan Reddy: జాతీయ పార్టీ స్థాపన అనేది అతి పెద్ద జోక్..8వ నిజాం కేసీఆర్: కిషన్‌రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి