నలుగురు విద్యార్థులకి నరకం చూపించిన టీచర్ పై కేసు

Last Updated : Dec 18, 2017, 04:58 PM IST
నలుగురు విద్యార్థులకి నరకం చూపించిన టీచర్ పై కేసు

హైదరాబాద్ లోని అల్వాల్ కి నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో నలుగురు విద్యార్థులకి నరకం చూపించిన ఓ కంప్యూటర్ టీచర్ పై, ఆ టీచర్ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. అల్వాల్ ఇన్ స్పెక్టర్ వి శ్రీకాంత్ గౌడ్ వెల్లడించిన కథనం ప్రకారం ఐజాక్ న్యూటన్ అనే విద్యార్థిపైతోపాటు మరో ముగ్గురు విద్యార్థులు హోంవర్క్ చేయలేదని ఆగ్రహించిన కంప్యూటర్ టీచర్.. పనిష్మెంట్ పేరుతో కి వారిపై ఎలాపడితే అలా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో న్యూటన్ తలకి బలమైన గాయాలవడంతో విషయం కాస్తా బాలల హక్కుల సంఘాల వరకు వెళ్లింది. 

ఈ ఘటనపై స్పందించిన స్కూల్ ప్రిన్సిపల్.. న్యూటన్ తల్లిదండ్రులు ఈ విషయమై పోలీసులకి ఫిర్యాదు చేయకుండా వుండేందుకు ముందు జాగ్రత్త చర్యగా వారిని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. ఇకపై ఏ టీచర్ ఎవ్వరిపై చేయి చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం అని మాట ఇస్తూ న్యూటన్ తల్లిదండ్రులకి ఓ లేఖ కూడా రాశారు. ఈ లేఖ ఆధారంగానే బాలల హక్కుల సంఘం నేత అచ్యుత రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్యూటర్ టీచర్ తోపాటు స్కూల్ యాజమాన్యంపై సెక్షన్ 324, 75 ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. 
ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన బాలల హక్కుల సంఘం నేత అచ్యుత రావు.. ' కంప్యూటర్ టీచర్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారని స్కూల్ ప్రిన్సిపల్ స్వయంగా న్యూటన్ తల్లిదండ్రులకి రాసిన లేఖలో అంగీకరించారని, బాలలపై దాడికి పాల్పడి, ఆ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినందుకు పాఠశాలని మూసివేసే దిశగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకి విజ్ఞప్తిచేశారు. 

Trending News