హైదరాబాద్‌లో ప్రస్తుతం క్షుద్రపూజల కలకలం రేగుతోంది. సంపూర్ణ చంద్రగ్రహణం నాడు మూడు నెలల పసికందు తల నరికి చిలకానగర్ ప్రాంతంలో ఒకరి ఇంటి మేడపై వదిలేసినట్లు ఓ కేసు స్థానిక పోలీస్ స్టేషనులో నమోదైంది. ఇలాంటి పనులు క్షుద్రపూజల్లో భాగంగానే చేస్తారని.. ఏవో అద్భుత శక్తులు వస్తాయనే మూఢనమ్మకాలతో కొందరు నీచులు ఇలాంటి పనులకు ఒడిగడుతుంటారని ఇప్పటికే పలువురు హేతువాదులు, ప్రజా సంఘాల నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ క్రమంలో ఈ సంఘటన స్థానికంగా భయాందోళనలను కలిగిస్తోంది. అయితే పోలీసులు దర్యాప్తు చేసి సంపూర్ణ చంద్రగ్రహణం రోజు చిలకానగర్ ప్రాంతంలో అసలు ఏం జరిగింది.. స్థానికంగా ఏవైనా పూజలు జరిగియా అన్న కోణంలో ఆలోచించారు. అదే రోజు నరహరి అనే ఓ వ్యక్తి ఇంట్లో అసహజమైన రీతిలో ఏవో పూజలు జరిగినట్లు తెలుసుకున్నారు.
అయితే పసికందుకు హత్యకు.. ఈ పూజలకు ఏవైనా సంబంధాలున్నయా లేదా అన్న విషయాలు మాత్రం ఇంకా ఏమీ తెలియరాలేదు. ఈ క్రమంలో ఎంక్వయరీ నిమిత్తం నరహరితో పాటు అతని కుమారుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఈ కేసులో నేరస్థులు శిశువు తల నరికి చిలకానగర్‌లో ఉబర్ డ్రైవరుగా పనిచేస్తున్న రాజశేఖర్ ఇంటి మేడపై వదిలిపెట్టడం గమనార్హం.
గురువారం ఉదయం రాజశేఖర్ అత్తయ్య మేడపై బట్టలు ఆరబెట్టడానికి వెళ్లి.. శిశువు తలను చూసి షాక్‌కు గురైంది. ఆ తర్వాత ఈ విషయం పోలీసులకు తెలియజేయగా.. వారు శిశువు తలను పోస్టుమార్టంకు పంపించి.. నేరస్థుల జాడ కనుగొనేందుకు డాగ్ స్వ్కాడ్ సహకారం కూడా తీసుకున్నారు. అయితే వివరాలు ఏమీ తెలియలేదు. ఈ కేసు నిమిత్తం జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ తరుణ్ జోషి మాట్లాడుతూ ఉప్పల్ ప్రాంత పరిధిలోకి వచ్చే చిలకానగర్‌లో జరిగిన శిశుహత్య అమానవీయమైన చర్య అని.. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.