Bandi Sanjay Condemns Govt Teachers Arrest: వినాశకాలే విపరీత బుద్ది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పసిపిల్లలు ఏడుస్తున్నా నీ మనసు కరగడం లేదా కేసీఆర్..? అని ప్రశ్నించారు. తల్లులను, పిల్లలను వేరు చేసి అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. మానవత్వం లేని మృగానివంటూ సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు ఏశారు. ప్రజాస్వామ్యవాదులారా స్పందించండి అంటూ పిలుపునిచ్చారు. 317 జీవోను సవరించాలని కోరుతూ ప్రజాస్వామ్యబద్దంగా గత రెండ్రోజులుగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల పట్ల పోలీసుల అనుసరించిన వైఖరి అత్యంత అమానుషమని అన్నారు. అసలు టీచర్లు చేసిన తప్పేంటి..? భార్యాభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలనడమే నేరమా..? అని అడిగారు.
తక్షణమే భేషరతుగా టీచర్లను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 317 జీవో సవరణపై ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే 317 జీవోను సవరిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు, పసిపిల్లలని కూడా చూడకుండా వేరు చేయడం దుర్మార్గమన్నారు. చంటిపిల్లలు ఏడుస్తున్నా తల్లిని, పిల్లలను వేరు చేస్తూ ఈడ్చుకుంటూ అరెస్ట్ చేయడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు. టీచర్లను అరెస్ట్ చేస్తున్న తీరును చూసి సభ్యసమాజం అసహ్యించుకుంటోందన్నారు.
'ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మానవత్వం లేదని మరోసారి రుజువైంది. పిల్లలతో కలిసి టీచర్ల కుటుంబాలు నడిరోడ్లపై ధర్నాలు, ఆందోళన చేస్తున్నా.. పసిపిల్లలు భోరున ఏడుస్తున్నా మనుసు కరగడం లేదు. నిత్యం ఓట్లు, సీట్ల, డబ్బు రాజకీయాలే తప్ప భావోద్వేగాలు, మానవ సంబంధాలు పట్టని మానవ మృగం. 317 జీవోను సవరించాలని కోరుతూ గత ఏడాది ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న నన్ను, నాతోపాటు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టిన అప్రజాస్వామికంగా వ్యవహరించిన తీరు ఈ సందర్భంగా గుర్తుకొస్తోంది.
భార్యను ఒక దగ్గర, భర్తను మరోచోట బదిలీ చేయడం అన్యాయం. రెండేళ్లు కావొస్తున్నా సమస్యను పరిష్కరించకుండా అమానుషంగా వ్యవహరించడం దారుణం. కేసీఆర్ సర్కార్‌కు పోయే కాలం దాపురించింది. వినాశకాలే విపరీత బుద్ధి అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. తక్షణమే అరెస్ట్ చేసిన టీచర్లందరినీ భేషరతుగా విడుదల చేయాలి. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. లేనిపక్షంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 317 జీవోను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తాం..' అని బండి సంజయ్ అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook