Kishan Reddy Letter To CM KCR: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్ రెడ్డి.. 9 ఏళ్లుగా రాష్ట్రంలో అసమర్థ పాలన కారణంగా ప్రజలకు జరుగుతున్న నష్టాలు, సర్కారు హామీలు ఇచ్చి ప్రజలను మోసంచేసిన అంశాలను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. మిగిలిన 4 నెలల్లో అయినా హామీలను పూర్తి చేయాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో బతుకులు బాగుపడతాయని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు. 2014, 2018 ఎన్నికల ప్రచారం సందర్భంలో అనేక హామీలు ఇచ్చారని.. వాటిని తక్షణమే నెరవేర్చాలని లేఖలో పేర్కొన్నారు.
ఏకమొత్తంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటూ రైతులకు పెద్దఎత్తున ఆశలు కల్పించి వారితో ఓట్లు వేయించుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏక మొత్తంలో కాదు.. విడతలవారీగా మాఫీ చేస్తామంటూ దానిని నీరుగార్చారని మండిపడ్డారు. రుణం మాఫీ అవుతుందన్న ఆశతో రైతులు వడ్డీలు కట్టలేదని.. వడ్డీలు పేరుకుపోయి అసలును మించిపోయిందన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు అదనపు వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించాలన్నారు.
"తెలంగాణలో పేద గిరిజనులు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక, ఉప ఎన్నిక వచ్చినా పోడు భూములకు పట్టాలిస్తామని మీరు హామీ ఇస్తున్నారు. ఎన్నికలయ్యాక ఆ హామీని మరచిపోతున్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజనులను గుర్తించి, తక్షణమే వారికి ఆ భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాలివ్వాలి.
ఉద్యోగ నియామకాలు చేపట్టకపోగా.. కనీసం నిరుద్యోగ భృతి హామీని సైతం నెరవేర్చలేదు. ప్రతి నిరుద్యోగికి రూ.3016 భృతి ఇస్తామని హామీ ఇచ్చారని.. తక్షణమే భృతి ఇవ్వాలి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై లక్షల మంది పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 9 ఏళ్లుగా వారి ఆశలు అడియాసలవుతూనే ఉన్నాయి. 2018 ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ చాలా కొన్ని ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. శంకుస్థాపనలు చేసి ఐదేళ్లవుతున్నా పూర్తి కాని ఇళ్లే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల మధ్యలో నిర్మాణం ఆపడం వల్ల అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. మీరు హామీ ఇచ్చిన విధంగా తక్షణమే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందివ్వాలి. అదేవిధంగా తక్షణమే కొత్తగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు జారీ చేయాలి.
ఎలాంటి ఆలస్యానికి, అక్రమాలకు తావివ్వకుండా అర్హతలున్న ప్రతి దళిత కుటుంబానికి తక్షణమే ‘దళితబంధు’ ఇవ్వాలి. కులవృత్తులపై ఆధారపడిన వెనకబడిన వర్గాలకు రూ.లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంపిక చేసిన కొంత మందికే కాకుండా.. ఈ పథకానికి అర్హులందరినీ గుర్తించి వారికి కూడా ఆర్థిక సాయం చేయాలి. ఈ సాయాన్ని రూ.5 లక్షలకు పెంచాలి. తెలంగాణలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గల్ఫ్ బాట పట్టిన వారు లక్షల్లోనే ఉన్నారు. హామీ ఇచ్చిన మేరకు తక్షణమే ఎన్‌ఆర్ఐ పాలసీ తీసుకొచ్చి.. రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి, సెక్రటేరియట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి.." అని కిషన్ రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు.
ధరణి వల్ల రికార్డుల్లో ఎంతో మంది పేర్లు గల్లంతయ్యాయని.. కొందరి ఆస్తులు గల్లంతయ్యాయని అన్నారు. ఒకరి ఆస్తి మరొకరి పేరు మీద రికార్డులు చూపిస్తున్నాయన్నారు. ఫలితంగా వారు క్రయవిక్రయాలు జరపలేక, రుణాలు తీసుకోలేక లబోదిబోమంటున్నారని అన్నారు. భూవివాదాలు ఇంకా ఎక్కువయ్యాయన్నారు. ధరణి వల్ల ఉత్పన్నమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని.. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని లేఖలో ప్రస్తావించారు.
Also Read: Yashasvi Jaiswal: రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం అద్భుతం.. ఆ సీక్రెట్ బయటపెట్టిన యశస్వి జైస్వాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook