Godavari Floods: వారం రోజుల పాటు తెలంగాణలో కుండపోత వర్షాలు కురిశాయి. పలు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. వరద పోటెత్తింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులు తెగి మత్తడి దూకాయి. కొన్ని చెరువలకు గండ్లు పడటంతో వరద గ్రామాలను ముంచెత్తింది. గత వారం రోజులు తెలంగాణలో ఎటు చూసినా వరదే కనిపించింది. వాగులు, పంటలు ఏకమయ్యాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇక గోదావరికి రికార్డ్ స్థాయిలో వరదలు వచ్చాయి. గోదావరి తీర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. వందలాది గ్రామాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, వరదలు బీభత్సం స్పష్టిస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ నుంచి బయిటికి రాలేదు. రోజుకో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ కాలం వెళ్లదీసింది సీంఎంవో.
తెలంగాణతో పోలిస్తే ఏపీలో వర్షాలు బాగా తక్కువగా కురిశాయి. గోదావరి మినహా వరదలు కూడా లేవు. అయినా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి వరత బాధితులకు సాయం ప్రకటించారు. ముంపు గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు అందించాలని ఆదేశించారు. సీఎం జగన్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటికి రాకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు శుక్రవారం పలు పార్టీల నేతలకు ఫోన్ చేసి జాతీయ రాజకీయాలపై చర్చించారు కేసీఆర్. శనివారం మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఇది మరింత విమర్శలపాలైంది. వరదలతో జనాలు అల్లాడిపోతున్నా పట్టించుకోకుండా కేసీఆర్ రాజకీయాలపై ఫోకస్ చేశారని విపక్షాలు ఆరోపించాయి. వరదలపై ఫోకస్ చేయాల్సిన కేసీఆర్.. రాజకీయలపై సమావేశాలు పెట్టడం ఏంటన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి వచ్చాయి.
అయితే శనివారం ఉదయం తెలంగాణ సీఎంవో నుంచి ప్రకటన వచ్చింది. సీఎం కేసీఆర్ ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారని సీఎంవో వెల్లడించింది. కడెం నుంచి భద్రాచలం వరకు గోదావరి వరదతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వరదలకు ధ్వంసమైన పంటలను కేసీఆర్ పరిశీలిస్తారని తెలిపింది. అయితే కేసీఆర్ ఏరియల్ సర్వే చేయడానికి సిద్ధం కావడానికి మరో కారమం ఉందనే టాక్ వస్తోంది. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ వరద ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివారం ఆమె కొత్తగూడం జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ షెడ్యూల్ శనివారం ఉదయమే ఖరారైంది. శనివారం రాత్రికి హైదరాబాద్ నుంచి రైలులో బయలుదెరనున్న గవర్నర్.. రాత్రికి కొత్తగూడెం చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి ఆదివారం వరద బాధితులను కలుస్తారు. భద్రాచలం వెళ్లి ముంపు వాసులతో మాట్లాడనున్నారు గవర్నర్ తమిళి సై. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు షెడ్యూల్ ఖరారు చేశాయి. గవర్నర్ వరద ప్రాంతాలకు వెళుతుండటం తనకు ఇబ్బందిగా మారుతుందన్న గ్రహించిన కేసీఆర్.. ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. గవర్నర్ కొత్తగూడెం జిల్లా పర్యటన వెళ్లకుంటే కేసీఆర్ ఏరియల్ సర్వే చేసేవారు కాదనే టాక్ వస్తోంది.
ఇక గవర్నర్ కొత్తగూడెం జిల్లా పర్యటన రాజకీయ దుమారం రేపనుందనే వార్తలు వస్తున్నాయి .నిజానికి గవర్నర్ తమిళి సై ఆదివారం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని ఆమె కొత్తగూడెం వెళుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల సూచనలతోనే గవర్నర్ వరద ప్రాంతాలకు వెళుతున్నారనే టాక్ వస్తేంది. కొంత కాలంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్. ప్రధాని మోడీపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవలే రెండున్నర గంటలు ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ సర్కార్ విధానాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కూడా బీజేపీని వ్యతిరేకించే పలు పార్టీల అధినేతలతో ఫోన్ లో మాట్లాడారు. అదే సమయంలో కొంత కాలంగా గవర్నర్ ను తెలంగాణ సర్కార్ అవమానిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. తమిళి సై కూడా ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పారు. దీంతో గవర్నర్ అస్త్రంగా కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా కేంద్రం పెద్దలు ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందులో భాగంగానే గవర్నర్ వరద ప్రాంతాలకు వెళుతున్నారని అంటున్నారు. ఇప్పటికే జనాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్.. గవర్నర్ వరద ప్రాంతాలకు వెళితే మరింతగా విమర్శలు ఎదుర్కొంటారు. అందుకే అప్రమత్తమై ఏరియల్ సర్వేకు సిద్ధమయ్యారనే వాదన రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.
Read also: Covid Cases: వరుసగా మూడో రోజు 20 వేలకుపైనే కొత్త కేసులు.. దేశంలో కొవిడ్ కల్లోలం..
Read also: Godavari Floods: గోదావరికి 16వ తేదీ గండం.. వరద విలయమేనా... తీరంలో ఏం జరగబోతోంది?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Godavari Floods: వరద ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే.. గవర్నర్ భద్రాచలం టూరే కారణమా?
తెలంగాణ గవర్నర్ వర్సెస్ సీఎం
రేపు వరద ప్రాంతాలకు తమిళి సై
ఏరియల్ సర్వే చేయనున్న కేసీఆర్