తెలంగాణ సీఎం కేసీఆర్ గౌడ కులస్థులపై నేడు వరాల జల్లు కురిపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గౌడ కులవృత్తిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇకపై తాటి, ఈత చెట్లపై వసూలు చేసే శిస్తును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గౌడ భవనం నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి, రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సభకు తెలిపారు. కుల వృత్తిని నమ్ముకున్న వారిలో గౌడ కులస్థులు అధికం. సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా కల్లుగీత వృత్తి కల్లోలంలో పడింది. లిక్కర్ మాఫియా ముసుగులో కల్లు దుకాణాలను ఎత్తేశారు. ఉద్యమ సమయంలో గౌడ్ కులస్థులకు జరుగుతున్న అన్యాయాన్ని పదే పదే ప్రశ్నించాం. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్లో కల్లు దుకాణాలు తెరిపించాం. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం చెందిన కల్లు గీత కార్మికులకు పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచినట్లు సీఎం స్పష్టంచేశారు.
గీత కార్మికుల పెన్షన్ను రూ. 200 నుంచి రూ. 1000 పెంచడం జరిగింది. టీఎఫ్టీ కార్మికులకు కూడా పెన్షన్ అందిస్తాం. దీంతో మొత్తం 30 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది అని సీఎం తెలిపారు. అదేవిధంగా లైసెన్స్ రెన్యూవల్ గడువును ఇకపై ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. గత మూడేళ్ల కాలంలో రూ. 6.38 కోట్ల పరిహార బకాయిలు చెల్లించడం జరిగింది. హరితహారంలో భాగంగా చెరువు గట్లు, వాగులు. వర్రెలు, నదీ ప్రవాహానికి ఇరు వైపుల కోటి 70 లక్షల తాటి, ఈత మొక్కలు నాటినట్లు సీఎం కేసీఆర్ సభకు తెలిపారు.