నాకు హిందీ భాష బాగా వచ్చు.. వాళ్లను చీల్చిచెండాడుకుంటా : కేసీఆర్

కేసీఆర్ అంటే ఆ ఇద్దరికీ అందుకే భయం అని స్పష్టంచేసిన టీఆర్ఎస్ అధినేత

Last Updated : Dec 3, 2018, 08:46 PM IST
నాకు హిందీ భాష బాగా వచ్చు.. వాళ్లను చీల్చిచెండాడుకుంటా : కేసీఆర్

మధిర: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఓటర్లను ఆకర్షించేందుకు ఆ రెండు పార్టీల నేతలు నోటికి ఏది వస్తే, అది చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారని తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేటి సాయంత్రం ఖమ్మం జిల్లాలోని మధిరలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనపై చేస్తోన్న ఒక ఆరోపణను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణకు వచ్చిన మోదీనేమో.. కేసీఆర్ కాంగ్రెస్ ఏజెంట్ అని ఆరోపిస్తారు. అదే సమయంలో తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ కూడా కేసీఆర్ ఎవరో కాదు.. ప్రధాని నరేంద్ర మోదీ ఏజెంట్ అని ఆరోపిస్తారు. ఈ ఇద్దరూ ఇలా నన్ను బద్నాం చేసి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు కానీ వాళ్లు చెబుతున్నట్టుగా తాను ఎవ్వరికీ ఏజెంట్ ను కాదని, తెలంగాణ ప్రజలు, రైతన్నలకే తాను ఏజెంట్ నని కేసీఆర్ స్పష్టంచేశారు. 

అయితే, నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరూ తనపై అలా చెప్పడానికి కారణం లేకపోలేదన్న కేసీఆర్... కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను కృషి చేస్తుండటమే వారికి జీర్ణం కావడం లేదని అన్నారు. అందుకే ఆ ఇద్దరూ తనపై ఎదురు దాడికి దిగుతున్నారని, కేసీఆర్ అంటే వారికి భయమని టీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. అన్నింటికిమించి తనకు హిందీ కూడా బాగా వచ్చు కనుక ఈ ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్లి ఆ ఇద్దరినీ చీల్చి చెండాడుకుంటానని కేసీఆర్ హెచ్చరించారు.

Trending News