హైదరాబాదు: బతుకమ్మ పండుగ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఆడబిడ్డలకు చీరల పంపిణీ కార్యక్రమం పలు విమర్శలకు తావిచ్చింది. సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి, తెలంగాణ ఆడపడుచులకు పండుగ కానుక అనే విధానంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమం కొన్ని వివాదాలను కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న మహిళలు ఈ చీరలను తీసుకోవడానికి బారులు తీరిన సందర్భంలో కొందరు మహిళలు చీరలు నాసిరకంగా ఉన్నాయని పేర్కొని, వాటిని కాల్చివేశారనే వార్తలు రావడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
"ఏ ఆడబిడ్డ కూడా చీరను కాల్చదు.. నచ్చకుంటే ఇంటికి తీసుకెళ్లి పక్కన పెడ్తది.. బతుకమ్మ పేర్చే పువ్వులనే క్రింద పడకుంగా చూసుకుంటారు.. అలాంటిది వారే చీరలు కాల్చుతారా" అని కేటీఆర్ స్పందించారు. ఇవ్వన్నీ తామంటే కిట్టని ప్రతిపక్షపార్టీలు వేసే ఎత్తుగడలని, నీచ రాజకీయాలను తాము ఎదుర్కొంటామని తెలిపారు. రాష్ట్ర్రవ్యాపంగా ఎనిమిది వేల కేంద్రాల్లో 25 లక్షల చీరలు పంపిణీ చేశామని, కేవలం 4,5 చోట్లలో మాత్రమే కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయని, మొత్తం మీద కార్యక్రయం విజయవంతమైందని పేర్కొన్నారు.