Telangana District-wise Rains Updates: నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను గురువారం సాయంత్రం 5 గంటలకు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 38500 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్ట్ 4 ప్రధాన గేట్లను ఎత్తి మంజీరలోకి 20,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేస్తుండడంతో ఇప్పటికే మంజీర పరివాహక ప్రాంతం ప్రజలను నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర ప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను గురువారం ఎత్తివేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీటి ఇన్ ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్ట్ నిండుకుంది.దీంతో గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ 4 ప్రధాన గేట్లను ఎత్తి దిగువ మంజీరా నదిలోకి 20000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ అధికారులు మాట్లాడుతూ, ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1403.42 అడుగులకు చేరుకుందని.. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 15.557 టీఎంసీ లకు చేరుకుందని అన్నారు. ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ఉదృతి కొనసాగుతుండటంతో మంజీరా నదిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే ఇన్ ఫ్లో ఆధారంగా గేట్ల సంఖ్యను పెంచడం, తగ్గించడం జరుగుతుందని అన్నారు. ప్రాజెక్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న ఔట్ ఫ్లోను దృష్టిలో పెట్టుకొని మంజీర పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వేములవాడ రాజన్న క్షేత్రంలో పరిస్థితి ఎలా ఉందంటే..
భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో వేములవాడ పట్టణంలోని అన్ని రోడ్లపై జనసంచారం చాలా తక్కువగా ఉంది. భారీ వర్షంతో వేములవాడ పక్కనే గల మూలవాగు ప్రవహిస్తుంది. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నిశాఖల అధికారులతో మాట్లాడి చేపట్టాల్సిన పనులను చర్చించారు. ఇదే సమయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని వాగులు, ఒర్రెల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి హెచ్చరికలను ఏర్పాటుచేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేములవాడ మూలవాగు జలకళ సంతరించుకుంది. మూలవాగులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వేములవాడ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కట్టు కాలువ వద్ద ఉన్న బుడగ జంగాల కాలనీ మొత్తం నీటిమయం అయింది. వేములవాడ నుండే జగిత్యాల వెళ్లే రహదారి అలాగే వేములవాడ నుండి కోరుట్ల వెళ్లే రహదారిలో మర్రిపల్లి వద్ద రహదారి కొట్టుకుపోయింది. హన్మాజిపేట నక్క వాగు పొంగి పోర్లడంతో ఆ దారులు పూర్తిగా నిలిచి పోయాయి. శాత్రజూపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణంలో ఉండగా వర్షం ధాటికి అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్వీస్ రోడ్ కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపొకలు పూర్తిగా నిలిచిపోయాయి. డీఎస్పీ నాగేంద్ర చారి, టౌన్ సిఐ కరుణాకర్ తహసిల్దార్ రాజిరెడ్డి లోతట్టు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ఖమ్మం మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మున్నేరు ప్రాంతంలో ఓ ధ్యానమందిరంలో ఏడుగురు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆ జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో భద్రాచలం గోదావరి వరద పరిస్థితిని పరీశీలించడానికి వెళ్లిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అక్కడి నుంచి వెనుతిరిగి హుటాహుటిన ఖమ్మం చేరుకున్నారు. విశాఖపట్నం నుండి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలతో శ్రమించి వారిని రక్షించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారు అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు రావాలని మంత్రి ప్రజలను కోరారు.
ఇది కూడా చదవండి : Bus Stuck in Flood Water: వరద నీటిలో ప్రయాణికులతో రోడ్డుపై నుంచి కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు
ఇదిలావుంటే, మరోవైపు ఇదే మున్నేరు వరదకు భారీ కొండచిలువ కొట్టుకొచ్చింది. ఖమ్మం నగరంలోని సారధినగర్ ప్రాంతంలో ఇంట్లోకి భారీ కొండచిలువ ప్రవేశించింది. భారీ కొండచిలువను చూసి ఆ ఇంట్లోని వారు, ఇరుగుపొరుగు హడలిపోయారు. దీంతో స్థానికులు ఆ కొండచిలువను పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Rains News Live Updates: తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి.. బయటకు రావొద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి