Revanth Reddy: తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని.. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటే మనం దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యమని.. అలాంటి శాఖకు మీరు (ఏఈఈలు) ప్రతినిధులుగా నియామకమవుతున్నారని చెప్పారు.. ఇది మీకు ఉద్యోగం కాదని.. మీకు ఒక భావోద్వేగమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లి పాఠాలు నేర్వాలని సూచించారు.
Also Read: KTR: హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేను ఉంటాను: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో ఏఈఈ ఉద్యోగ అభ్యర్థులకు గురువారం నియామక పత్రాల అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేశారు. లక్ష కోట్లు ఖర్చు చేశారు కానీ లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. 'కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే జల వనరుల శాఖ ఉండదు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది' అని వివరించారు. 'ఈఈ చెప్పారని ఒకరు.. ఎస్ఈ చెప్పారని ఇంకొకరు, ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు' అని తెలిపారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కాదని పేర్కొన్నారు.
Also Read: Harish Rao: మంత్రివర్యా కోమటిరెడ్డి నీ వీడియో చూపిస్తా.. ఒకసారి చూస్కో
'నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది మీకు ఉద్యోగం కాదు ఇది మీకు ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు' అని ఏఈఈలకు రేవంత్ రెడ్డి సూచించారు. 'పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు' అని గుర్తు చేశారు.
'గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేశాకే నివేదికలు రాసే వారు. కానీ ఈ మధ్య క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే కట్టడం కూలడం రెండూ జరిగాయి' అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 'దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి. అధికారులనా? రాజకీయ నాయకులనా?' అని ప్రశ్నించారు.
'మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి' అని రేవంత్ రెడ్డి సూచించారు. పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించాలని చెప్పారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని తెలిపారు. 'తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం. ప్రాజెక్టుల పూర్తికి క్షేత్రస్థాయిలో పని చేయాలి. రికమెండేషన్‌తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి శిక్ష ఇవ్వండి. పని మీద శ్రద్ధ పెట్టండి పోస్టింగ్ ల మీద కాదు' సూచించారు. 'అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి' అని రేవంత్ రెడ్డి కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.