ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూరు ప్రాంతంలో పదో తరగతి క్వశ్చన్ పేపరు లీకైంది. ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాన్ని ఎవరో సిబ్బంది వాట్సాప్ ద్వారా బహిర్గతం చేశారు. ఈ ఘటన ఎగ్జామ్ పూర్తయ్యాక ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఉట్నూరు ఆర్డివో జగదీశ్వర్‌రెడ్డి ఇప్పటికే విచారణ చేపట్టారు. కారకులు ఎవరో తెలుసుకొని పోలీసులకు అప్పగిస్తామని తెలిపారు.
పదవ తరగతి పరీక్షలు ఈ నెల 15 తేది నుండి తెలంగాణలో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని విద్యాశాఖ అధికారులు డీఈవోలను ఆదేశించారు. ఈ ఏడాది దాదాపు అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. అయినా ఇలాంటి తప్పిదాలుజరగడం వెనుక అధికారుల వైఫల్యం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు