Telangana Politics: టీఆర్ఎస్ తో వామపక్షాల పొత్తు ఖరారు! కమ్యూనిస్టులకు కేసీఆర్ ఇచ్చే టికెట్లు ఇవేనా?

Telangana Politics: తెలంగాణలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ చిత్రం మారిపోనుందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టింది సీపీఐ

Written by - Srisailam | Last Updated : Aug 21, 2022, 02:50 PM IST
  • టీఆర్ఎస్ తో వామపక్షాల పొత్తు
  • సీట్లపై సీఎం కేసీఆర్ కసరత్తు
  • రెండు ఎంపీ సీట్లపై ఏకాభిప్రాయం
Telangana Politics: టీఆర్ఎస్ తో వామపక్షాల పొత్తు ఖరారు! కమ్యూనిస్టులకు కేసీఆర్ ఇచ్చే టికెట్లు ఇవేనా?

Telangana Politics: తెలంగాణలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ చిత్రం మారిపోనుందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. 2014లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  టీఆర్ఎస్, బీజేపీ సింగిల్ గా పోటీ చేయగా.. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే రాష్ట్రంలో తాజాగా పార్టీల మధ్య సమీకరణలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న వామపక్షాలు కారు పార్టీకి దగ్గరవుతున్నాయి. నాగార్జున సాగర్, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు ఇచ్చాయి వామపక్షాలు. తాజాగా జరగబోతున్న నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టింది సీపీఐ. మునుగోడులో జరిగిన కేసీఆర్ సభలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. సీపీఎం కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది.

మునుగోడు సభలో మాట్లాడిన కేసీఆర్ తమకు మద్దతు ఇచ్చినందుకు సీపీఐకి ధన్యవాదాలు చెప్పారు. ఈ పొత్తు మునుగోడుకే పరిమితం కాదని.. భవిష్యత్ లోనూ కొనసాగుతుందని చెప్పారు. ప్రగతిశీల శక్తులను కలుపుకుని పోతామని చెప్పారు. సీపీఎం కూడా తమతో కలిసివస్తుందన్నారు కేసీఆర్. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. సీపీఐ, సీపీఎం కేంద్రం నేతలతో ఇటీవలే ప్రగతి భవన్ లో కేసీఆర్ చర్చలు జరిపారు. ఆ సమయంలోనే పొత్తుల అంశంపై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడు మీదుంది. అదే సమయంలో కాంగ్రెస్ రోజురోజుకు బలహీనమవుతుందనే భావనలో వామపక్ష పార్టీలు ఉన్నాయి. బీజేపీని అడ్డుకోవాలంటే కేసీఆర్ తో కలిసి నడవడమే మంచిదని సీపీఐ, సీపీఎం నేతలు నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. అందుకే మునుగోడులో అధికార పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చిందని.. సీపీఎం కూడా త్వరలోనే మద్దతు ప్రకటన చేయబోతుందని సమాచారం.

టీఆర్ఎస్ తో వామపక్షాల పొత్తు ఖరారు కావడంతో వాళ్లకు ఎన్ని సీట్లు ఇస్తారన్నదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.  రెండు ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కామ్రెడ్లు డిమాండ్ చేస్తున్నారని.. అయితే కేసీఆర్ మాత్రం రెండు ఎంపీ సీట్లకు ఓకే చెప్పారని.. అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదని అంటున్నారు. సీపీఐకి నల్గొండ ఎంపీ సీటు.. సీపీఎంకు ఖమ్మం ఎంపీ సీటు ఇచ్చేందుకు కేసీఆర్ దాదాపుగా అంగీకరించారని చెబుతున్నారు. గతంలో ఖమ్మం, నల్గొండ నుంచి వామపక్షాల అభ్యర్థులు పలుసార్లు ఎంపీగా గెలిచారు. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే చెరో ఐదు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కామ్రెడ్లు కోరుతుండగా.. కేసీఆర్ మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదంటున్నారు. రెండు పార్టీలకు నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ సీట్లు.. ఎమ్మెల్యే కోటాలో చెరో ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే పొత్తులకు ఇరు పార్టీలు ఓకే చెప్పినా.. ఇంకా సీట్ల విషయంలో పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదని సమాచారం.

ఉమ్మడి నల్గొండ , ఖమ్మం జిల్లాలో గతంలో వామమక్షాలు బలంగా ఉండేవి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని పలు సెగ్మెంట్లలోనూ కామ్రెడ్లకు పట్టుంది, ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని అసెంబ్లీ సీట్లలో వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసి మాత్రం గెలవలేదు. 1984, 1989, 1994లో టీడీపీతో వామపక్షాలు పొత్తులో ఉన్నాయి. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయి. 2009లో  టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసిపోటీ చేశాయి. 2014లో దేవరకొండ నుంచి గెలిచిన సీపీఐ ఎమ్మెల్యే.. తర్వాత అధికార పార్టీలో చేరారు. నల్గొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నకిరేకల్, రామన్నపేట నుంచి కామెడ్రులు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి కమ్యూనిస్టులు పలు సార్లు గెలిచారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నుంచి పలు సార్లు గెలిచారు.

రాష్ట్ర విభజన తర్వాత బలహీనమయ్యారు కామ్రెడ్లు. చాలా నియోజకవర్గాల్లో కేడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఉమ్మడి, నల్గొండ జిల్లాల్లోని కొన్ని సెగ్మెంట్లలో ఆ పార్టీకి 15 వేల నుంచి 25 వేల ఓట్లు ఉన్నాయంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కామ్రెడ్లకు 2 నుంచి 3 శాతం ఓటు బ్యాంక్ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం త్రిముఖ పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు, మూడు శాతం ఓట్లు అత్యంత కీలకమని పీకే టీమ్ కేసీఆర్ కు నివేదిక ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో వామపక్షాలతో పొత్తుకు సిద్దమవుతున్న కేసీఆర్.. వాళ్లకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ సీట్లను సీపీఐ.. మిర్యాలగూడ సీటును సీపీఎం కోరుకునే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం, భద్రాచలం, వైరా సీట్లను సీపీఎం.. కొత్తగూడెం, ఇల్లెందు సీట్లను సీపీఐ కోరే అవకాశం ఉంది. పినపాక, అశ్వారావుపేట సీట్లలో పోటీకి వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. కేసీఆర్ మాత్రం నల్గొండ జిల్లాలో ఒకటి, ఖమ్మం జిల్లాలో మూడు సీట్లు వామపక్షాలకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

Also Read: Amit Sha:బిగ్ బ్రేకింగ్: అమిత్ షాను కలవనున్న జూనియర్ ఎన్టీఆర్..పొలిటికల్ రీ ఎంట్రీ!

Also Read:Vijay Devarakonda Boycott Liger: ఇండియా ఫ్లాగ్ ఎగరవేస్తే సినిమాని బాయికాట్ చేస్తారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x