కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరుపై టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగిస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సబబు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ప్రతులను చించి విసరడం చాలా దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల నినాదాలు, నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం పూర్తి చేసిన అనంతరం కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సభ్యుల తీరును తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ప్రతిపక్షాలకు నిజంగానే వున్నట్టయితే, ముఖ్యమంత్రికి సలహాలు, సూచనలు ఇచ్చి రాష్ట్రాభివృద్ధిలో పాల్పంచుకోవాలి కానీ ఇలా అభ్యంతరకర రీతిలో గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడటం సరికాదని కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ తీరును చూసి తెలంగాణ సమాజం ఏవగించుకుంటుందని ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.