BRS: టీఆర్ఎస్ రిటర్న్స్…?.. కేసీఆర్ ముందున్న వ్యూహం అదేనా.. !

BRS: బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ముఖ్య లీడర్లు తరుచూ ఢిల్లీ ఎందుకు వెళుతున్నట్లు..? తీహార్ జైలులో ఉన్న కవిత ములాఖత్ భేటీ పైకి కనిపిస్తున్నా...దాని వెనుక ఇంకేదైనా మతలబు ఉందా….ఈ మధ్య రెగ్యులర్ గా  ఢిల్లీ వస్తున్న కేటీఆర్, హరీష్ రావుల పర్యటన వెనుక  ఏదైనా సీక్రెట్ మిషన్ దాగి ఉందా ? ఇంతకీ తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది..?

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 14, 2024, 10:06 AM IST
BRS: టీఆర్ఎస్ రిటర్న్స్…?.. కేసీఆర్ ముందున్న వ్యూహం అదేనా.. !

BRS: గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఛీఫ్ కేసీఆర్  తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్షేత్ర స్థాయిలో ఉన్న పార్టీ క్యాడర్ తో సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఓటమితో పాటు బీఆర్ఎస్ పార్టీకీ ప్రజలకు మధ్యన గ్యాప్ ఎక్కడ వచ్చింది అని గులాబీ బాస్ కూలకుషంగా పోస్ట్ మార్టమ్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ తప్పా మరో పార్టీకీ స్థానం లేదని పలుమార్లు బీఆర్ఎస్ నేతలు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. వారి మాటలు చూస్తున్న తరుణంలో చాలా మంది కూడా అదే నిజం కాబోతుంది అనుకున్నారు. కానీ మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయమై..  బీఆర్ఎస్ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో ఒక స్పష్టత వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణలో తమకు తిరుగులేదు అనుకున్న బీఆర్ఎస్ కు ప్రజలు ఎన్నికల్లో పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పవచ్చు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణలో నెంబర్ వన్ అని చెప్పుకునన్న బీఆర్ఎస్ ను ప్రజలు ఎందుకు దూరం పెట్టారు. నిజంగా ఈ ఓటమి  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఒక రకంగా తీవ్రంగా కృంగిపోయేలా చేసిందని చెప్పవచ్చు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయంలో దేశానికే తలమానికంగా నిలిచేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పునిచ్చారని తన వద్దకు వచ్చిన నేతలతో పదే పదే ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో కరెంట్ పోకుండా చేశాం.  ఇంటింటికి తాగు నీరు అందించాం. రైతుబంధు, రైతుభరోసాతో రైతాంగానికి అండగా నిలిచినా..  ప్రజలు తమ పార్టీని ఎందుకు ఆదరించలేదనే విషయమై పార్టీ క్యాడర్ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

అయితే కేసీఆర్ వాదన ఇలా ఉంటే గులాబీ పార్టీ నేతలు, క్యాడర్ వాదన మరోలా ఉంది. అసలు తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం చూడలేదు.  వాళ్లు ఇంకేదో గిట్టక బీఆర్ఎస్ కు ఇలాంటి తీర్పు ఇచ్చారని అధినేత కేసీఆర్ ముందు కుండబద్దలు కొడుతున్నారు. ఇక ముసుగులో గుద్దలాట ఎందుకు మన పార్టీ నుంచి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చడమే మనం చేసిన పెద్ద తప్పిదం సార్ ..ఇదే ఓటమికి ప్రధాన కారణం అని కేసీఆర్ కు చెప్పారట. దీంతో కేసీఆర్ కూడా ఆలోచనలో పడ్డారట. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని ఆశించి పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చితే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుడు మాటెరుగు సొంత రాష్ట్రంలో ఇంతటి దారుణ పరిస్థితికి పడిపోయామా అని తీవ్ర ఆలోచనలో పడ్డారట గులాబీ బాస్.

అసెంబ్లీ ఎన్నికల  తర్వాత తుంటి కాలు ప్రమాదానికి గురై దాదాపు మూడు నెలల విశ్రాంతి తీసుకున్న కేసీఆర్...ఆ తర్వాత తెలంగాణ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఇదే అంశంపై కూడా మాట్లాడారు. పార్టీ క్యాడర్ మళ్లీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు కానీ అది అసాధ్యం. బీఆర్ఎస్ గానే ఉంటుంది అని స్పష్టం చేశారు అధినేత. దీంతో తెలంగాణ ఉద్యమ నాటి నుంచి ఉన్న క్యాడర్. నేతలు అంతా కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనిపైనా చర్చ మాత్రం ఆగలేదు. ఇదే సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చాయి. దీంతో  ప్రచారంలోకి స్వయంగా రంగంలోకి దిగి కేసీఆర్ బస్సుయాత్రతో జిల్లాలన్నీ చుట్టి వచ్చారు. అయినా పార్టీకీ పెద్దగా ప్రయోజనం చేకూరింది లేదు.

పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవి చూసింది. గతంలో ఎప్పుడూ లేనంతగా పార్టీ లోక్ సభలో ప్రాతినిథ్యమే  లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ నేతల నుంచి క్యాడర్ దాకా పూర్తి నైరాశ్యంలో పడిపోయారు.  ఇది ఒక వైపు ఉంటే మరోవైపు పార్టీలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఒక్కొరొక్కరుగా  కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ నుంచి బయటకు జంప్ అవుతానే విషయం తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

సాక్షాత్తు గులాబీ బాస్ రంగంలోకి దిగి ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా బుజ్జగింపులకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ఫాం హౌజ్ లో ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన కొద్ది గంటల్లోనే ఎమ్మెల్యేలు పార్టీనీ వీడడం కేసీఆర్ తో సహా పార్టీనీ విస్మయానికి గురి చేసింది. ఇది ఇలా ఉండగానే మరో వైపు రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. దీంతో పెద్ద ఎత్తున యువత ఆందోళన చేపట్టింది. దీనిలో బీఆర్ఎస్ కూడా యాక్టివ్ గా పాల్గొంది. యువత నుంచి బీఆర్ఎస్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాంగ్రెస్ కన్నా అప్పటి బీఆర్ఎస్ కొంత మేర నయం అనే టాక్ యూత్ నుంచి రావడం ప్రారంభమైంది ఇదే అదనుగా బీఆర్ఎస్ కూడా యువత ఆందోళనలనో యాక్టివ్ గా ఉంటూ వారికి మరింత చేరువయ్యేందకు ప్రయత్నాలు ప్రారంభించారు.

నిరుద్యోగులు ఇచ్చిన ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు పార్టీకీ ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. యూత్ నుంచి మంచి సపోర్ట్ ఉందని పార్టీ మీద ఇప్పుడిప్పుడే తెలంగాణ యువతకు ఉన్న నెగటివ్ ఇంప్రెషన్ పోతుందని చెప్పారట. దీంతో పాటు తాము పదేళ్ల తర్వాత ఉద్యమాల్లో పాల్గొంటుంటే తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారట. ఇక్కడే ఒక ఆసక్తికర అంశం తెర మీదకు వచ్చిందట. అన్నా మేము తెలంగాణ ఉద్యమంంలో పాల్గొన్న రోజుల్లో టీఆర్ఎస్ అంటే చాలు వందలాది మంది యువత వచ్చే  వాళ్లు కానీ నేడు బీఆర్ఎస్ అంటే యువత ఎందుకో వెనుకడుగు వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక యువ నాయకుడు చెప్పాడట. టీఆర్ఎస్ అంటేనే  తెలంగాణలో ఒక బ్రాండ్ అలాంటిది మనం బీఆర్ఎస్ గా మారిన తర్వాత యువతతో పాటు తెలంగాణ ప్రజలకు దూరమయ్యామని చెప్పుకొచ్చాడట.

ఇప్పటికైనా అవకాశాలు ఉంటే పార్టీనీ మళ్లీ టీఆర్ఎస్ గా మార్చితే మళ్లీ మనకు తిరుగు ఉండదు అని ఆ యువ నాయకుడు చెప్పగానే అక్కడ ఉన్న మిగితా నేతలు సైతం దీనికి గట్టిగా మద్దతు ఇచ్చారట. పెద్ద సార్ కు చెప్పి ఎలాగైన పార్టీనీ మళ్లీ టీఆర్ఎస్ గా మార్చుకుందామని కేటీఆర్ కు విన్నవించారట. దీనిపై స్పందించిన కేటీఆర్ కూడా అవును నాతో పాటు పార్టీలోని సీనియర్లందరిదీ అదే ఆలోచన కానీ..పార్టీ పేరు మార్పు అంశం అంత ఈజీ కాదు కదా దీనిపై చాలా సీరియస్ గా స్టడీ చేయాలని కేటీఆర్ వాళ్లకు చెప్పారంట.

ఇది ఇలా ఉండగానే ఈ మధ్య కాలంలోనే కేటీఆర్, హరీష్‌ రావు తరుచూ ఢిల్లీకీ వెళుతుండడం కూడా పలు అనుమానాలకు తావు ఇస్తుంది. ఢిల్లీలో మద్యం కేసులో జైలులో ఉన్న కవిత ములాఖత్ అని చెబుతున్నా..దానికి మించి ఏదో న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సీనియర్ న్యాయవాదిని రంగంలోకి దించాలనుకుంటున్న గులాబీ బాస్ పార్టీ పేరు మార్పుపై కూడా దృష్టి పెట్టినట్లు తెలసింది. బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్ గా మార్చే అవకాశం ఏ మేర ఉంది. ఒక వేళ టీఆర్ఎస్ గా మారితే పార్టీ సింబల్ కారుగానే ఉంటుందా లేక మళ్లీ వేరు గుర్తును ఇస్తారా అన్న అంశాలపై  ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అందుకే కేటీఆర్, హరీష్‌ రావు ఢిల్లీ పర్యటనల వెనుక ఇది ఒక కారణం కావొచ్చు అని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరగుతుంది. మొత్తంగా పార్టీ క్యాడర్ ఆశిస్తున్నట్లు బీఆర్ఎస్ , టీఆర్ఎస్ గా మారుతుందా లేదా జరిగిందేదో జరిగింది..బీఆర్ఎస్ గానే భవిష్యత్తు రాజకీయాలు ఉంటాయా వేచి చూడాలి.

Also read: Pulasa fish: వలలో చిక్కిన తొలి పులస చేప.. దీనికి జనాల్లో ఎందుకంత క్రేజ్.. పులస కేజీ ధర ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News