కరోనా వైరస్ కారణంగా. . దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి నడుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అన్నీ బంద్ చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 80 జిల్లాలు లాక్ డౌన్ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
తెలంగాణలోనూ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఐతే నిత్యావససర సరుకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తేల్చి చెప్పారు. నేటి నుంచి ఈ నెల 31వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ క్రమంలో జనం నిత్యావసర సరుకులు, కూరగాయలకు ఎగబడ్డారు. ఐతే ఇదే సమయంలో జనం నుంచి వస్తున్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో లాక్ డౌన్ ఎఫెక్ట్
ముఖ్యంగా ఇవాళ ఉదయం రైతు బజార్లు జనం రద్దీతో కిటకిటలాడాయి. దీంతో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ఇష్టం వచ్చిన విధంగా కూరగాయల ధరలు పెంచేశారు. సాధారణంగా ఉన్న కూరగాయల ధరలు అమాంతంగా చుక్కలనంటాయి. కిలో మిర్చి 100 రూపాయలకు చేరింది. అలాగే టమాటో 50, క్యారెట్ 50 రూపాయల రేటు పలికాయి. బెండకాయ, దోసకాయ, దొండకాయ లాంటి కూరగాయలు ఏకంగా 60 రూపాయలకు పెంచేశారు.
ఉన్నపళంగా ధరలు పెంచేయడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రంగంలోకి దిగి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..