దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న గృహవినియోగదారులకు హైదరాబాద్ జలమండలి మళ్లీ రూ.1కే కొళాయి కనెక్షన్ మంజూరు చేస్తోంది. దరఖాస్తు దారుల నుంచి ఎలాంటి అదనపు మొత్తాన్ని వసూలు చేయకుండా అవసరమైన పత్రాలను సమర్పిస్తే జీబీ కంట్రాక్టర్ల ద్వారా నూతన కనెక్షన్ లు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్మార్ట్ ఫోన్ లలో సైతం నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గత సంవత్సరం పేదలకు రూ.1కే నల్లా కనెక్షన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యుత్ బిల్లు, పట్టా లేదా సేల్ డీడ్ దస్తావేజులు అందుబాటులో లేనప్పుడు రూ.20 స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ ఇవ్వాలని పేర్కొంది.
ఒక్క రూపాయి కనెక్షన్‌కు కావాల్సినవి
* 15ఎంఎం డయా కనెక్షన్ మాత్రమే మంజూరు చేస్తారు.
* గృహా వినియోగదారుల విభాగంలో నల్లా కనెక్షన్లు పొందవచ్చు, ప్లాట్లు వైశాల్యం 100 చదరపు మీటర్ల కంటే తక్కువగా ఉండాలి.
* భవన నిర్మాణం జీ ఫ్లస్ 1 అంతస్తు (6 మీటర్ల ఎత్తు) కంటే ఎక్కువ ఉండకూడదు.
* రెండో కనెక్షన్‌కు ఈ పథకం పరిగణించబడదు
* దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ. 2 లక్షల కన్నా తక్కువగా ఉంటే వారిని పరిగణనలోకి తీసుకుంటారు.
అవసరమైన పత్రాలు
* డిప్యూటీ తహసీల్దార్, ఆపై రెవెన్యూ విభాగం అధికారుల ద్వారా జారీ చేసిన ఆదాయపు ధ్రువీకరణ పత్రం.
* పట్టా సర్టిఫికెట్, సేల్‌డీడ్ దస్తావేజులు అందుబాటులో లేనప్పుడు రూ. 20 స్టాంప్ పేపర్‌పై స్థల వైశాల్యంపై ధ్రువీకరణ కోసం దరఖాస్తుదారుడు అఫిడవిట్ ఇవ్వాలి.
* దరఖాస్తుదారులు ప్రస్తుత విద్యుత్ బిల్లును సమర్పించాల్సి ఉంటుంది.