హైదరాబాద్: ఎంఐఎం పార్టీ నేతలు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సైతం కామెంట్లు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని తలకిందులుగా వేలాడదీసి గెడ్డం కోసేసి.. సీఎం కేసీఆర్‌కు అతికిస్తానని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా నిజామాబాద్ పట్టణంలో శుక్రవారం ‘ఇందూర్ ప్రజా ప్రదర్శన’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో అరవింద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆరెస్సెస్‌ను, బీజేపీని చించేస్తానని అసదుద్దీన్ అన్నారని.. కానీ సొంత తమ్ముడు అక్బరుద్దీన్‌ను వారి సొంత మనిషి మహ్మద్ పైల్వాన్ 50సార్లు పొడిచి, తుపాకీతో కూడా కాల్చాడని అరవింద్ గుర్తుచేశారు. నీ తమ్ముడు ఇప్పటికీ శరీరానికి అతుకులు వేయించుకోవడం కోసం తొమ్మిదేళ్లు పూర్తయినా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడని.. ఏడాదిలో ఆరు నెలలపాటు ఆస్పత్రుల్లో ఉంటాడని.. అలాంటిది మీరు బీజేపీని చింపుతారా అని ప్రశ్నించారు. ఇటీవల ఎంఐఎం సభ నిర్వహించిన స్థలంలోనే భారీ క్రేన్‌ను తీసుకొచ్చి ఉల్టా వేలాడతీసి గెడ్డం కోసేస్తానని, ఆ గెడ్డాన్ని సీఎంకు అతికించి ప్రమోషన్ ఇస్తానని పరుషవ్యాఖ్యలు చేశారు.
BJP Nizamabad MP Dharmapuri Arvind: I warn you(Asaduddin Owaisi) that I will hang you upside down to a crane and shave your beard. I will give promotion to your beard by sticking it to the Chief Minister. #Telangana (3.1.20) pic.twitter.com/9Tpy43Qb4P
— ANI (@ANI) January 4, 2020
హైదరాబాద్ పాతబస్తీలో చాలా చోట్ల దుర్వాసన వస్తుంటది, ముందు ఎంపీగా నీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎంపీ అసదుద్దీన్‌కు హితవు పలికారు. ’ఏం చేయడానికి నిజామాబాద్‌కు వస్తవు, నీ తమ్ముడ్ని కాపాడుకోలేకపోయావు.. ఇక్కడకొచ్చి ఏం చేస్తావు. నిజామాబాద్ గడ్డ.. బీజేపీకి అడ్డా అని‘ ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 70శాతం హిందువుల ఓట్లు బీజేపీకి పడ్డాయని, ఇప్పుడు 90శాతం ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
గంపగుత్త ఓట్లు వేయడం మీకు మాత్రమే కాదని, మాకు తెలుసునంటూ బీజేపీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు ముకుమ్మడిగా ఓట్లేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, అదే రోజు (శుక్రవారం) సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు వ్యతిరేకంగా అసదుద్దీన్ ఒవైసీ ఆన్లైన్ క్యాంపెయిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.