YS Sharmila: గంగుల కమలాకర్ కాదు.. రంగుల కమలాకర్.. కేసీఆర్ కాదు.. 420.. వైఎస్ షర్మిల కౌంటర్ ఎటాక్

YS Sharmila Speech in Karimnagar : కరీంనగర్‌లో చేపట్టిన పాదయాత్ర సభలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎంపీ, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సీఎం కేసీఆర్‌ల వైఖరిపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

Written by - Pavan | Last Updated : Nov 16, 2022, 05:11 AM IST
YS Sharmila: గంగుల కమలాకర్ కాదు.. రంగుల కమలాకర్.. కేసీఆర్ కాదు.. 420.. వైఎస్ షర్మిల కౌంటర్ ఎటాక్

YS Sharmila Speech in Karimnagar : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేరు గంగుల కమలాకర్ కాదు.. రంగుల కమలాకర్ అని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు... గంగుల ముదిరి రంగుల కమలాకర్ అయ్యాడు. గ్రానైట్ మాఫియా.. ఇసుక మాఫియా.. గుట్కా మాఫియా.. భూ కబ్జాలు చేసి కరీంనగర్ ఎమ్మెల్యే కాస్తా కరీంనగర్ కి డాన్ అయి కూర్చున్నాడు. డాన్ అంటే మొత్తం మాఫియా పని చేయడమే అని.. డబ్బు సంపాదనే సింగిల్ అజెండాగా పెట్టుకున్న డాన్ అని గంగుల కమలాకర్ ని ఏకిపారేశారు. గంగుల కమలాకర్ ఇంట్లో ఈడి సోదాలు కూడా చేసింది. కట్టలు కట్టలుగా హవాలా డబ్బులు దొరికాయని తెలిసింది. గ్రానైట్ మైనింగ్‌లో తప్పుడు లెక్కలు చూపించి 350 కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించకుండా ఎగ్గొట్టినట్టు తేలిందన్నారు. గంగుల కమలాకర్ అడ్డగోలు దోపిడీకి అదే నిదర్శనం కాదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కరీంనగర్‌లో మంగళవారం జరిగిన పాదయాత్రలో మాట్లాడుతూ వైఎస్ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈడి వచ్చి నోటీసులు ఇస్తే.. కేసీఆర్ సర్కారు కనీసం ఈ మంత్రిపై చర్యలైనా తీసుకోలేదు. అవినీతి జరిగిందా ? లేదా ? అని రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపించాలి కదా ? కానీ అలా జరగలేదు. ఎందుకంటే గంగుల కమలాకర్ దోపిడిలో పెద్ద దొరకు, చిన్న దొరకు ఇవ్వాల్సిన కమీషన్లు అందుతున్నాయి కనుకే ఈ రంగుల కమలాకర్‌పై కేసులు లేవు, విచారణ లేదు అని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా రాష్ట్రంలోనే నెంబర్ 1 మాఫియాగా కొనసాగుతోంది. మొత్తం ఇసుక మాఫియా గంగుల కమలాకర్ గుప్పిట్లో ఉంది. ప్రశ్నించిన వారిపై వీలైతే డబ్బులు చల్లుతారు.. వినకుంటే దాడులు చేస్తారు. కరీంనగర్‌లో రంగుల కమలాకర్ రౌడీ రాజ్యం నడుస్తోంది. న్యాయం, ధర్మం అంటూ ఇక్కడ ఏదీ బ్రతికి లేదని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. 

పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన రంగుల కమలాకర్ మా పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఈ తెలంగాణలో TRS పార్టీకి తప్ప వేరే పార్టీకి స్థానం లేదట. మా కోసం ఒక పిచ్చాసుపత్రి కట్టిస్తాడట. ఇక మేము నీళ్ళు, కరెంట్, ప్రాజెక్టులు ఎత్తుకు పోతామట. బుర్ర లేని మంత్రి.. బుర్రలేని మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా పిచ్చోళ్లు.. అధికారం పిచ్చి పట్టింది మీకు. డబ్బు పిచ్చి పట్టింది నీకు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్న చందంగా ఏది పడితే అది దోచుకు తినే పిచ్చి మీది. మాకు ప్రజా సేవ చేయాలనే పిచ్చి మాత్రమే ఉంది కానీ మీలా దోచుకు తినాలనే పిచ్చి లేదని మంత్రి గంగుల కమలాకర్ కి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. 

ఎండను లెక్కచేయకుండా పాదయాత్ర చేయాలనే పిచ్చి ఉంది. ప్రజల దగ్గర ఉండాలనే పిచ్చి ఉంది. మీలాగా డబ్బు పిచ్చి, అధికారం పిచ్చి మాకు లేదు. ప్రపంచంలో ఎక్కడైనా డబ్బు పిచ్చి,అధికార పిచ్చి నయం చేసే ఆసుపత్రిలో చూపించుకొండి అని మంత్రి గంగుల కమలాకర్ కి హితవు పలికారు. మీ కళ్ళకు నీళ్ళు ఎత్తుకు పోయే దొంగల్లా కనిపిస్తున్నామా ? కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి...ఫామ్ హౌజ్‌కి ఎత్తుకు పోయిన దొంగ మీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ గంగుల కమలాకర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాణహిత - చేవెళ్లతో వైఎస్ఆర్ లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని ఆకాంక్షించారు. కానీ ఆ ప్రాజెక్టును రీ డిజైన్ చేసి లక్ష కోట్లు దోచుకు పోయింది మీరు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేలా ఆనాడు వైఎస్ఆర్ కృషి చేశారు. వైఎస్సార్ సాగునీరు ఇస్తే కదా... ఈ కరీంనగర్ సస్యశ్యామలం అయ్యింది అని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. 

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రస్తావన తీసుకొచ్చిన వైఎస్ షర్మిల.. ఈయన బీజేపికి రాష్ట్ర అద్యక్షుడు కూడా అని చెబుతూ కూట్లో రాయి తీయలేని వాడు.. ఏట్లో రాయి తీస్తాడట. ఇక్కడ ఇంత అవినీతి జరుగుతుంటే... ఏనాడైనా మాట్లాడిండా అని ప్రశ్నించారు. ఇక్కడ గ్రానైట్ మాఫియా మీద ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఈడి వచ్చి సోదాలు చేస్తోంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్.. ఇద్దరూ ఒక్కటే అని ఆరోపించారు. గ్రానైట్ దోపిడీలో ఇద్దరికీ వాటాలు ఉన్నాయి. పెద్ద బీజేపీ నాయకుడులా రాష్ట్రం గురించి మాట్లాడుతాడు.. ఇక్కడ ఈయన ముక్కు కింద జరిగే అవినీతి గురించి మాత్రం మాట్లాడడు అని బండి సంజయ్ ని ఎద్దేవా చేశారు. 

స్మార్ట్ సిటీ అని చెప్పి కేంద్రం నిధులు ఇస్తే మొత్తం మింగేశారట కదా. బండి సంజయ్ మత పిచ్చోడు. తలకాయ లేని ఎన్నో మాటలు చెప్పాడు. మసీదులు తవ్వితే శివుడు వస్తే హిందువులది అంట.. శవాలు వస్తే ముస్లీంలదట. మతం పేరుతో చిచ్చు పెట్టాలి.. చలి కాచుకోవాలి... ఇదే బీజేపీ రాజకీయం. మతం పేరుతో రాజకీయాలు తప్ప మరొకటి చేసింది లేదని ఆరోపిస్తూ బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల కోసం ఏనాడు మాట్లాడలేదు. బండి సంజయ్ మతం పిచ్చి మాటలు మాట్లాడుతుంటే కనీసం చర్యలు లేవు అని ప్రభుత్వాలను నిలదీశారు. బీజేపీకి బండి సంజయ్ లాంటి వాళ్లే కావాలి కనుకే ఆయనపై చర్యలు లేవని బీజేపిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు.. పెద్ద 420 అని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాను మోసం చేసిన మోసగాడు కేసీఅర్. ఇదే కరీంనగర్ జిల్లాకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎంతో చేశాడు. ఈ జిల్లాకు వైఎస్ఆర్‌తో విడదీయరాని బంధం ఉంది. ఈ జిల్లా కోసం ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఎల్లంపల్లి ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఎస్ఆర్ఎస్పీ కాలువలకు మరమత్తులు చేయించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు దోహదపడ్డారు. పాదయాత్రలో ఎక్కడికెళ్లినా అడుగడుగునా మీ నాయన వైఎస్ఆర్ నీళ్ళు ఇచ్చారు అని ప్రజలే చెప్తున్నారు అంటూ కేసీఆర్ సర్కారుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

Trending News