ఆఫ్ఘనిస్తాన్ మరోమారు ఉలిక్కిపడింది. బుధవారం రాజధాని కాబూల్‌లో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. వీటిలో ఒకటి ఒక పోలీస్ స్టేషన్‌కు సమీపంలో సంభవించింది. కాబూల్ పోలీసు విభాగం అధికార ప్రతినిధి హస్మత్ స్టానెక్జాయ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ఎదుట పేలుడు సంభవించిందని, పోలీసులకు, దుండగులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అన్నారు. మరో బాంబు పేలుడు పోలీస్ స్టేషన్‌కు సమీపంలో కాబుల్‌లోని కాలా-ఈ-ఫతుల్లా ప్రాంతంలో జరిగినట్లు పేర్కొన్నారు. నగరంలో మధ్యలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎదుట బాంబు పేలుడు సంభవించడంతో హుటాహుటిన భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
గతకొద్ది రోజులుగా కాబుల్‌లో ఆత్మాహుతి దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణించారు. గతవారంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు ఖోస్ట్ రాష్ట్రంలో ఓ మసీదు ఆవరణలో ఏర్పాటుచేసిన ఓటరు రిజిస్ట్రేషన్ కేంద్రంలో భారీ పేలుడు జరగ్గా.. ఈ ఘటనలో 17మందికిపైగా మరణించగా ..పలువురు గాయపడ్డారు.