చైనాలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా వైరస్ గురించి మరో భయంకరమైన వార్త చైనా బయట పెట్టింది. ఈ కరోనా వైరస్ . . గతంలో వచ్చిన సార్స్ వైరస్ కంటే ప్రమాదమని పేర్కొంది. గతంలో 2003లో చైనాలోనే వచ్చిన సార్స్ వైరస్ గుర్తుందా..! ఇది అప్పట్లో అతి కొద్ది సమయంలోనే వందలాది ప్రాణాలు తీసింది. ఐతే తాజాగా వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ .. దాని కంటే డేంజర్ అంటూ చైనా వెల్లడించింది.
800 దాటిన కరోనా మృతులు
కరోనా వైరస్ .. చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా 810 మంది మృతి చెందారని చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 33 వేల 738 మంది పాజిటివ్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఇప్పటి వరకు 2 వేల 649 మందికి చికిత్స చేసి.. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత ..వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కరోనా వైరస్ ఇప్పటికే 25 దేశాలకు వ్యాప్తి చెందింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పలు దేశాలు కంటి మీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నాయి.
మరోవైపు చైనాలో గతంలో వచ్చిన సార్స్ వైరస్ .. కంటే కరోనా వైరస్ ప్రమాదమని హెచ్చరికలు వెలువడుతున్నాయి. అప్పట్లో సార్స్ వైరస్ 26 దేశాలకు విస్తరించి 774 మంది ప్రాణాలు మింగేసింది.