యూకేలోని రష్యా మాజీ ఏజెంట్ సెర్గీ స్క్రిపాల్, అతని కుమార్తెపై విష ప్రయోగం చేయడాన్ని నిరసిస్తూ రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించాలని అమెరికా, పలు యురోపియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే అమెరికా, తమ దేశంలో పనిచేస్తున్న 60 మంది రష్యా దౌత్యాధికారుల్ని సోమవారం బహిష్కరించింది. వీళ్లందరూ రష్యా ఇంటెలిజెన్స్ అధికారులని ఆరోపించింది. కుటుంబాలతో సహా 7 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. సియాటెల్‌లో ఉన్న రష్యా కాన్సులేట్‌ను మూసివేయాలని పేర్కొంది.
అమెరికా బహిష్కరించిన వారిలో దాదాపు 12 మంది ఐక్యరాజ్య సమితి మిషన్‌లో శాశ్వత ప్రతినిధులుగా ఉన్నారు. 20వ శతాబ్దంలో అమెరికాలో రష్యాకు చెందిన ఇంతమంది దౌత్యవేత్తలను బహిష్కరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పోరోచెంకో ప్రభుత్వం కూడా 13 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించాలని నిర్ణయించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం నలుగురిని, జర్మనీ ప్రభుత్వం కూడా నలుగురు రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరించాలని నిర్ణయించాయి. లిథువేనియా, పోలండ్ దేశాలు కూడా రష్యన్ దౌత్యవేత్తలను బహిష్కరిస్తామని తెలిపాయి. కాగా, సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రష్యా తన ప్రవర్తనను మార్చుకోవాలని అమెరికా కోరింది.