న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి యూకేలో 7,000 మందికి పైగా మరణించారు. అయితే భారత సంతతి రియా లఖాని అనే కరోనా బాధితురాలు స్పందిస్తూ.. నేను దాదాపు చనిపోయాననుకున్నానని, కరోనావైరస్ బారి నుండి బయటపడిన కొన్ని రోజుల తరువాత సాధారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాననని బీబీసీతో తెలిపింది.
ఈ మహమ్మారి బారి నుండి కోలుకున్న తరవాత స్వీయ నియంత్రణ పాటిస్తున్నానని, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతోందని అన్నారు. ఇప్పటికీ తన భర్తను కౌగిలించుకోలేదని, తల్లిదండ్రులతో దూరాన్ని పాటిస్తునని పేర్కొంది. అచాలాసియా అనబడే ఓసోఫాగియల్ వ్యాధితో బాధపడుతున్న లఖానికి ఏడు సంవత్సరాల క్రితం శస్త్రచికిత్స చేయబడిందని, ఈ వ్యాధితో ఆమెకు మింగడం ఇబ్బందిగా ఉండేదని బీబీసీకి తెలిపింది. ఆమె ఆసుపత్రిలో చేరడం నిత్యకృత్యంగా మారిన క్రమంలో శ్వాస తీసుకోవడం, అధిక జ్వరం వంటి లక్షణాలు కనపడడంతో అనుమానంగా భావించి ముందు జాగ్రత్తగా COVID-19 పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆసుపత్రి వర్గాలు ఒక్కసారిగా ఆశ్చ్యర్యంలో పడిపోయాయి. వెంటనే ఆమె గదిని చుట్టుముట్టి మిగిలిన వార్డును ఖాళీ చేశారు.
రోజు రోజుకు ఆమె పరిస్థితి క్షీణించడంతో లండన్లోని ప్రధాన COVID-19 చికిత్స కేంద్రానికి మార్చారు. లఖానీకి న్యుమోనియా అభివృద్ధి చెందిందో లేదో ఇంకా స్పష్టంగా తెలియదని, శ్వాస బాగా తీసుకోగలుగుతున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చాలా మంది (సుమారు 80 శాతం) ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే ఈ వ్యాధి నుండి కోలుకుంటున్నారని, COVID-19 పాజిటివ్ అని తేలిన ప్రతి 6 మందిలో ఒకరు తీవ్రంగా అనారోగ్యానికి గురై శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని తెలిపింది.
డాక్టర్లు నిజమైన హీరోలు అని తనకు చికిత్స చేసిన వైద్య సిబ్బందిని లఖాని ప్రశంసించారు. ఇదిలా ఉండగా కరోనావైరస్ మహమ్మారితో యూకేలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం నాటికి 7,097 మరణాలు నమోదు కాగా, ఒక రోజులో 938 మంది చనిపోవడం ఇదే అత్యధికమని చెబుతున్నాయి. యూకేలో COVID-19 కేసులు 55,000 కు పైగా ఉన్నాయని, ఇది దేశ వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని ఓ అధికారి తెలిపారు.