గేదెలను వేలానికి పెట్టిన పాకిస్తాన్ ప్రధాని

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొదుపు మంత్రం జపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీసుకున్న కొత్త నిర్ణయాల్లో భాగంగా లోటు బడ్జెట్ పూడ్చడానికి ప్రధాని అధికారిక నివాసంలోని వస్తువులను ఆయన వేలం వేస్తున్నారు.

Last Updated : Sep 27, 2018, 08:26 PM IST
గేదెలను వేలానికి పెట్టిన పాకిస్తాన్ ప్రధాని

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొదుపు మంత్రం జపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీసుకున్న కొత్త నిర్ణయాల్లో భాగంగా లోటు బడ్జెట్ పూడ్చడానికి ప్రధాని అధికారిక నివాసంలోని వస్తువులను ఆయన వేలం వేస్తున్నారు. ఇటీవలే 61 విలాస వంతమైన బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లను వేలం వేయించిన ఇమ్రాన్.. ఆ తర్వాత ప్రధాని మంత్రులు వాడే బెంజి కార్లు, వాణిజ్య వాహనాలు, పాత మోడల్ సీసీ బిజినెస్ కార్లను కూడా వేలానికి పెట్టారు. ప్రస్తుతం ఇంట్లో గేదెలను కూడా వేలం వేయడానికి సిద్ధమయ్యారు. ఈ గేదెలను వేలం వేయగా వచ్చిన రూ.23 లక్షల రూపాయలను ప్రజా సంక్షేమం కోసం వాడేందుకు ఉపయోగిస్తానని తెలిపారు.

అలాగే ఒక్కొక్క గేదెకు కనీస ధరగా రూ.3,85,000ను నిర్ణయించారు. అయితే ఈ గేదెలన్నింటినీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ-ఇన్సాఫ్‌(పీటీఐ) కార్యకర్తలు కొనుక్కోవడం విశేషం. దేశంలో లోటు బడ్జెట్ పూరించడంతో పాటు ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకే ఈ వేలం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రధాని తెలిపారు. అయితే ప్రధాని నివాసంలో కనీసం పశువులను కూడా మిగల్చకుండా వేలం కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రతిపక్షాలు ఆయనపై మండి పడ్డాయి. తన జల్సాల కోసం ఈ డబ్బును ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వాపోయాయి.

ఇటీవలే జరిగిన పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాక్ ప్రధానిగా సేవలందిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆ దేశంలో లెజెండరీ క్రికెటర్‌గానూ పేరుగాంచారు. 1971లో టెస్టు క్రికెట్, 1974లో వన్డే క్రికెట్‌తో కెరీర్ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్ 88 టెస్టులు, 175 వన్డేలు ఆడారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకి కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. 1990ల్లో యూనిసెఫ్‌కు క్రీడా ప్రతినిధిగా కూడా ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ లాంటి దేశాలలో యూనిసెఫ్ తరఫున ఆరోగ్య కార్యక్రమాలకు ప్రచారకర్తగా కూడా వ్యవహరించారు. రాజకీయ రంగంలోకి వచ్చాక పాకిస్తాన్‌లో మొదటి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ వైద్యశాలను ఏర్పాటు చేయడంలో ఇమ్రాన్ ఖాన్ చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు.

Trending News