ఇరాన్ ప్రభుత్వం తన దేశ భద్రత కోసం మిసైల్స్ ఉత్పత్తిని కొనసాగిస్తుందని.. అయితే ఈ విషయంలో ఎలాంటి అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమించదని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయంపై అమెరికా విధిస్తున్న ఆంక్షలను ప్రశ్నించారు. ఆ దేశ ప్రతినిధులు ఇంటర్నేషనల్ న్యూక్లియర్ అగ్రిమెంట్‌లో భాగంగా ఇరాన్ దేశంలో కొనసాగుతున్న మిసైల్స్ ఉత్పత్తి వ్యవస్థను తప్పుపట్టడాన్ని ఆయన ఖండించారు.
"మా దేశభద్రత కోసం ఎలాంటి ఆయుధాలు తయారుచేసుకోవాలి.. అందుకోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్న విషయంలో మాకు పూర్తి అధికారం ఉంది. మేము మిసైల్స్ తయారు చేశాం, చేస్తున్నాం మరియు భవిష్యత్తులో మిసైల్ వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక ప్రయోగాలు ఇరాన్‌లో తప్పకుండా జరుగుతాయి" అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలే ఇరాన్ ఉత్పత్తి చేస్తున్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో.. అవి న్యూక్లియర్ ఆయుధాల తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని , ఐక్యరాజసమితి భద్రతా నియమాలను ఈ రకంగా ఆ దేశం ఉల్లంఘిస్తుందని అమెరికా ప్రకటించింది. అయితే తమ మిసైల్స్‌కు, న్యూక్లియర్ ఆయుధాలకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. అమెరికా వైఖరి మిగతా దేశాలతో పేచీకోరుతనాన్ని పెంచుకొనే విధంగా ఉందని, అదే జరిగితే తూర్పు ఆసియాతో అమెరికా సంబంధాలకు విఘాతం కలుగుతుందని హసన్ రౌహానీ తెలిపారు.
ఇరాన్ మిసైల్స్ ఉత్పత్తి చేసి తీరుతుంది