లిక్కర్ డాన్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు ఝలక్ ఇచ్చింది. లండన్‌లోని ఆయన ఆస్తులను సీజ్ చేసేందుకు అనుమతించింది. విజయ మాల్యా ప్రాపర్టీల్లోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రవేశించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే పోలీసు ఫోర్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. విజయ మాల్యా ఆస్తులపై నియంత్రణకు బ్యాంకులకు అధికారం ఉందని తేల్చింది. ఇవి సూచనలుగా పరిగణించవద్దని, ఈ ఆదేశాలను ఉపయోగించుకుని నిధులను రికవర్ చేసుకోవాలని బ్యాంకులకు న్యాయస్థానం సూచించింది. విజయమాల్యా ఆస్తులను రికవర్ చేసుకునే అధికారం ఇవ్వాలని భారత్ కు చెందిన 13 బ్యాంకుల కన్సార్టియం లండన్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది
తాజా ఉత్తర్వులతో లిక్కర్ డాన్ విజయ్ మాల్యాను భారత్ రప్పిందుకు పోరాడుతున్న 13 బ్యాంకుల కన్సార్టియంకు గొప్ప విజయం లభించనట్లుగానే భావించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లోని 13 బ్యాంకులకు దాదాపు 10 వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్య మార్చి 2, 2016లో లండన్ పారిపోయాడు. అప్పటి నుంచి అతడిని దేశానికి రప్పించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తాజా తీర్పుతో విజయ మాల్యాను భారత్ కు రప్పించాలనే ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు వేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.