భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి (జులై 23) నుంచి 27 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశాలైన రువాండ, ఉగాండ, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు.
23, 24 తేదీల్లో ప్రధాని మోదీ రువాండలో పర్యటించనున్నారు. భారత ప్రధానులు ఎవరూ ఇప్పటి వరకు రువాండలో పర్యటించలేదు. తొలిసారిగా ప్రధాని మోదీ.. రువాండ వెళ్తున్నారు. ఇది చారిత్రక పర్యటనగా అభివర్ణించింది భారత విదేశీ మంత్రిత్వ శాఖ. రక్షణ శాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై మోదీ రువాండతో ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉంది.
రెండు రోజుల రువాండ పర్యటన ముగించుకొని 24, 25 తేదీల్లో మోదీ ఉగాండలో పర్యటించనున్నారు. ఉగాండ పార్లమెంట్లో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం మూడు రోజులపాటు- 25 నుంచి 27వరకు దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ప్రపంచ శాంతి, రక్షణ, పలు అంతర్జాతీయ సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు.