Novelist Salman Rushdie Attacked: అమెరికాలోని పశ్చిమ న్యూయార్క్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన బ్రిటీష్-అమెరికన్ నవలా రచయిత సల్మాన్ రష్డీపై హత్యాయత్నం జరిగింది. చౌటౌక్వా కౌంటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రష్డీ స్టేజీపై ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా ఓ దుండగుడు ఆయన్ను కత్తితో పొడిచాడు. హఠాత్తుగా స్టేజీ పైకి దూసుకొచ్చిన ఆ దుండగుడు రష్డీ మెడ, కడుపు భాగంలో 10-15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో రష్డీ స్టేజీ పైనే కుప్పకూలగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం 11 గం. సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ హఠాత్పరిణామంతో ఆ కార్యక్రమానికి హాజరైన దాదాపు 2500 మంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అసలేం జరుగుతుందో కొద్దిసేపటివరకు వారికి అర్థం కాలేదు.
దుండగుడు నలుపు రంగు దుస్తులు, నలుపు రంగు మాస్క్ ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాదాపు 20 సెకన్ల పాటు దుండగుడు సల్మాన్ రష్డీపై ఆపకుండా కత్తితో దాడి చేసినట్లు చెప్పారు. న్యూయార్క్ నగరానికి 100 కి.మీ దూరంలో ఉన్న చౌటౌక్వా కౌంటీ నుంచి రష్డీని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రష్డీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రష్డీ ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉందని.. చేతి నరాలు తెగిపోయాయని, కాలేయం కూడా దెబ్బతిన్నదని.. అతని బుక్ ఏజెంట్ ఆండ్రూ వైలీ తెలిపారు.
సల్మాన్ రష్డీపై దాడికి కారణమేంటి :
భారత్‌లో పుట్టిన సల్మాన్ రష్డీ అమెరికాలో స్థిరపడ్డారు. 1981లో మిడ్నైట్ చిల్డ్రన్ అనే నవలతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. అదే సంవత్సరం బుకర్ ప్రైజ్‌కి ఎంపికయ్యారు. 1988లో ఆయన రాసిన ది సతానిక్ వెర్సెస్ (1988) నవల పెను దుమారం రేపింది. ముఖ్యంగా ముస్లిం ప్రపంచం సల్మాన్ రష్డీపై తీవ్ర స్థాయిలో స్పందించింది. రష్డీ దైవ దూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ అతన్ని చంపేందుకు అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమోనీ ఫత్వా జారీ చేశారు. 2012లోనూ రష్డీ హత్యకు ఇరాన్ రివార్డు ప్రకటించింది.
ఈ క్రమంలో రష్డీ రచనలను అనువాదం చేసేవారిపై, పబ్లిషర్స్‌పై కూడా హత్యాయత్నానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ రష్డీ దాదాపు పదేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. కనీసం తన పిల్లలకు కూడా తన ఆచూకీ చెప్పకుండా గడిపారు. 1990ల్లో అజ్ఞాతాన్ని వీడిన రష్డీ పోలీస్ భద్రత నడుమ బ్రిటన్‌లో చాలాకాలం పాటు ఉన్నారు. ఆ తర్వాత 2000లో అమెరికాకు మకాం మార్చారు. అప్పటినుంచి అక్కడే ఉంటున్నారు. ఇదే క్రమంలో రష్డీపై హఠాత్తుగా దాడి జరగడం సాహితీ ప్రపంచాన్ని, ప్రజాస్వామికవాదులను షాక్‌కి గురిచేసింది. సల్మాన్ రష్డీపై హత్యను పలువురు ప్రముఖ రచయితలు, ఆయా దేశాలు తీవ్రంగా ఖండించాయి. రష్డీపై దాడికి పాల్పడిన వ్యక్తిని హదీ మతర్ (24)గా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
Also Read: Karthikeya 2: కార్తికేయ 2 ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook