బాలీవుడ్ 'బాద్ షా' షారూఖ్ ఖాన్ సోదరి నూర్జహాన్ పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. పాకిస్థాన్‌లో వచ్చే నెల 25 వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికల్లో షారూఖ్ సోదరి అయిన నూర్జహాన్ ఖైబర్ ఫక్తూన్ ఖవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి.
షారూఖ్ ఖాన్ తండ్రి తరఫు బంధువైన నూర్జహాన్ తన కుటుంబంతో కలిసి షావాలి ఖతాల్ ప్రాంతంలో నివాసముంటోంది. రాజకీయ కుటుంబానికి చెందిన ఈమె గతంలో కౌన్సిలరుగా కూడా పనిచేశారు.
షారూఖ్‌తో ఆమెకు మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో రెండు సార్లు ముంబై వచ్చి షారూఖ్ కుటుంబసభ్యులను కలిశారామే. ‘మహిళల సాధికారత కోసం నేను పని చేయాలనుకుంటున్నాను. నా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాను’ అని ఆమె అన్నారు. ఆమె ఎన్నికల ప్రచారానికి సోదరుడు మన్సూర్ నాయకత్వం వహిస్తున్నారు. నూర్జహాన్ కుటుంబ పెద్దలు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నడిపిన ఉద్యమంలో తమ కుటుంబం చురుకుగా పాల్గొన్నాడని మన్సూర్ తెలిపారు.