న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో తొలిసారి పర్యటించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో అధికారులు త్వరలో షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడిపై ఉన్న అభిశంసన తీర్మానంపై వాషింగ్టన్‌లో వచ్చే వారం చర్చ జరగనుంది. ఆ ప్రక్రియ తర్వాతే భారత్‌లో ట్రంప్ పర్యటన తేదీలపై స్పష్టత రానుంది. ఏదో ఓ రోజు కచ్చితంగా భారత్‌లో పర్యటిస్తానని చెప్పే అమెరికా అధినేత ట్రంప్ కోరిక త్వరలో తీరనుంది.
కాగా, గతేడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా భారత్ ఆహ్వానించగా డొనాల్డ్ ట్రంప్ సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే. అంతకుముందే ఖరారైన కొన్ని కార్యక్రమాల కారణంగా భారత్‌లో తన పర్యటన వీలుకావడం లేదని వివరించారు. 2009 తర్వాత అతి తక్కువ వృద్ధి నమోదు కావడం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు భారత్ పర్యటనకు ఓకే చెప్పడం గమనార్హం.
గత డిసెంబర్‌లో ఇరు దేశాల మధ్య జరిగిన 2 ప్లస్ 2 చర్చల్లో భాగంగా భారత ప్రతినిధులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్ అమెరికాలో పర్యటించారు. భారత పర్యటనకు రావాల్సిందిగా ట్రంప్‌ను మరోసారి ఆహ్వానించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. సివిల్ ఏవియేషన్, చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ధ్వైపాక్షిక వాణిజ్య సంబంధ ఒప్పందాలపై ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ చర్చించనున్నారని సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..