ప్రపంచ జనాభా దినోత్సవం: 'కుటుంబ ప్రణాళిక అనేది ఒక మానవ హక్కు'

జులై 11.. ప్రపంచ జనాభా దినోత్సవం.

Last Updated : Jul 11, 2018, 11:31 AM IST
ప్రపంచ జనాభా దినోత్సవం: 'కుటుంబ ప్రణాళిక అనేది ఒక మానవ హక్కు'

జులై 11.. ప్రపంచ జనాభా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాలపై ప్రజల్లో ఒక అవగాహన తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించి ప్రతిఏటా నిర్వహిస్తోంది.

భారతదేశం 1.3 బిలియన్(130 కోట్లు) మంది జనాభాతో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉందని ఇక్యరాజ్య సమితి 2017 తన నివేదికలో పేర్కొంది. ఈ సమాచారాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ప్రపంచ జనాభా 7.6 బిలియన్ (760 కోట్లు)కు చేరుకుందని, 2030 నాటికి 8.6(860 కోట్లు) బిలియన్‌కు చేరుకుంటుందని యూఎన్ 2017 నివేదిక తెలిపింది.  

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, 1.4 బిలియన్ల మంది ప్రజలతో చైనా, 1.3 బిలియన్ మంది ప్రజలతో భారతదేశం అత్యధిక జనాభా కలిగిన తొలి రెండు దేశాలుగా పేర్కొంది. ప్రపంచ జనాభాలో చైనా 19%, భారత్ 18% జనాభాను కలిగి ఉన్నాయి. భారత్ మరో 7 ఏళ్లలో అంటే 2024 సంవత్సరానికల్లా చైనా జనాభాను మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని యూఎన్ 2017 నివేదిక అంచనా వేసింది.

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 214 మిలియన్ మంది మహిళలు గర్భం దాల్చడానికి ఇష్టపడటం లేదని, దీనికి కారణం సురక్షితమైన, సమర్థవంతమైన కుటుంబ ప్రణాళిక పద్ధతులను ఉపయోగించరని తెలిపింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 (NFHS-4) ప్రకారం, వివాహిత మహిళల్లో (15-49 సంవత్సరాలు) 53.5% శాతం కుటుంబ ప్రణాళిక పద్ధతులను పాటించేవారున్నారు.

మన మనుగడకు ఐక్యరాజ్య సమితి చేపట్టిన సెవెన్‌ బిలియన్‌ క్యాంపెయిన్‌ కొన్ని సూచనలు చేస్తోంది. అవి దారిద్య్రాన్ని, అసమానతలను తగ్గించడం, జనాభా పెరుగుదల వేగాన్ని అదుపు చేయడం,  చిన్న, బలమైన కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, తక్కువ సంతానం, వృద్ధుల సంఖ్య పెరగడంపై అప్రమత్తముగా ఉండటం, జవాబుదారీతనం, వివక్షత, నాణ్యత లాంటివి.

 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏటా జులై 11న జరుపుకుంటారు. ఆరోజున ప్రపంచవ్యాప్త జనాభా సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ఈఏడాది జరుపుకుంటున్న ప్రపంచ జనాభా దినోత్సవం  యొక్క థీమ్ 'కుటుంబ ప్రణాళిక అనేది ఒక మానవ హక్కు'.

Trending News