మన మైత్రీ ప్రపంచానికి ఊతం: మోదీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌‌తో భేటీ అయ్యారు.

Last Updated : Apr 28, 2018, 05:28 PM IST
మన మైత్రీ ప్రపంచానికి ఊతం: మోదీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌‌తో భేటీ అయ్యారు. అయితే ఇవి అధికారిక చర్చలు కావని ఇరు దేశాలు ఇంతకుముందే చెప్పాయి. ఎలాంటి ఒప్పందాలు, సంతకాలు, సంయుక్త ప్రకటనలు ఉండబోవని ఇప్పటికే అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ అనధికార సదస్సులో ఇరువురు నేతలు పలు అంతర్జాతీయ, ఇరు దేశాల అభివృద్ధి, ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక అడుగులతో పాటు పలు విషయాలపై లోతుగా చర్చించనున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

మోదీ, జీ జిన్‌పింగ్‌‌లు ఇరువురు వుహాన్‌లో ఈ భేటీ నిర్వహించారు. వుహాన్‌లోని హుబీ ప్రావిన్సియల్‌ మ్యూజియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఇరువురు తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో హుబీ ప్రావిన్స్‌ను సందర్శించిన విషయాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు మ్యూజియంలోని మార్కిస్‌ ఎగ్జిబిషన్‌ను సందర్శించి అక్కడ కొద్ది సమయం గడిపారు. అనంతరం మోదీ, జీ జిన్‌పింగ్‌ కలిసి ఇరు దేశాలకు చెందిన ఆరుగురు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆ తరువాత ప్రఖ్యాత ఈస్ట్‌ లేక్‌ వద్దనున్న ప్రభుత్వ అతిథి గృహంలో మోదీకి జిన్‌పింగ్‌ రాత్రి విందునిచ్చారు. ప్రఖ్యాత చైనా చిత్రకారుడు బీహొంగ్‌ రూపొందించిన చిత్రాలను జిన్‌పింగ్‌కు కానుకగా మోదీ ఇచ్చారు. శనివారం ఇద్దరూ నదీతీరాన కాసేపు నడిచి, పడవలో విహరిస్తారు. మధ్యాహ్న భోజనంతో భేటీ ముగుస్తుంది.

2014లో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత చైనాలో మోదీ పర్యటించడం నాల్గోసారి. జూన్‌ 9-10 తేదీల్లో క్వింగ్‌డవో పట్టణంలో నిర్వహించే ఎస్‌సీఓ సమ్మిట్‌లో మళ్లీ  ప్రధాని పాల్గొననున్నారు. ఇరుదేశ నాయకుల భేటీ అనేది కొత్త శకం ప్రారంభానికి నాంది అని చైనా మీడియా చెప్పుకొచ్చింది.  డోక్లామ్‌ సమస్య వల్ల ఏర్పడిన దూరాన్ని చెరిపేసి, పరస్పరం విశ్వాసాన్ని పెంచడానికి మోదీ పర్యటన ఉపయోగపడుతుందనీ చైనా పత్రిక పేర్కొంది.

ఇప్పుడు చోటు చేసుకున్న తరహా భేటీలు మున్ముందు మరిన్ని జరగాలని మోదీ ఆకాంక్షించారు. 2019లో ఇది భారత్‌లో జరిగితే తనకెంతో ఆనందం కలిగిస్తుందని చెప్పారు. అనంతరం మాట్లాడిన  జిన్‌పింగ్‌ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా చూసుకుంటే ఇరు దేశాలు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. రెండు దేశాలు ఎంతో పురోగతి సాధించాయి. చాలా సార్లు మోదీతో నేను భేటీ అయ్యాను. ఇలాంటి భేటీలు భవిష్యత్తులో మరిన్ని ఉండాలని నేనూ కోరుకుంటున్నానన్నారు. 

Trending News