కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న యూట్యూబ్ సుమారు గంట పాటు పనిచేయలేదు. భారత కాలగమనం ప్రకారం బుధవారం ఉదయం 6:30 నుండి యూట్యూబ్ సరిగా పనిచేయలేదు. యూట్యూబ్ స్పీడ్ తగ్గిందని యూజర్లు వాపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య నెలకొంది. దాంతో అవసరమైన వీడియోలు వెంటనే చూడలేకపోతున్నామని యూజర్లు బాధపడ్డారు. సోషల్ మీడియా ద్వారా వేలాది మంది యూజర్లు తమ సమస్యలను ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్ సమస్యను తెలియజేశారు.
వెబ్‌సైట్ పునరుద్ధరించబడిన తర్వాత.. యూట్యూబ్ వారి అధికారిక ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించామని, యూజర్ల సహనానికి ధన్యవాదాలని తెలిపారు. యూజర్లు ఇంకా సమస్యను ఎదుర్కొంటుంటే తమకు తెలియజేయాలని పేర్కొన్నారు. దీంతో థాంక్యూ యూట్యూబ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
We're back! Thanks for all of your patience. If you continue to experience issues, please let us know. https://t.co/NVU5GP7Sy6
— Team YouTube (@TeamYouTube) October 17, 2018
అంతకుముందు యూట్యూబ్.. దీనికి కారణం ఏంటనేది అధికారికంగా చెప్పలేదు. అయితే సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. ఇంటర్నల్ సర్వర్ సమస్యల కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
'యూట్యూబ్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్ సమస్యల గురించి మీ నివేదికలు అందాయి. ధన్యవాదాలు. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సమస్య పరిష్కరించాక మీకు తెలియజేస్తాం. దీని వలన కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి' అంటూ సమస్య పరిష్కరించక ముందు యూట్యూబ్ తెలిపింది.
గత నెలలో కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలే ఎదుర్కొన్నాయి.