స్కూలు ఫీజు కట్టలేని నిస్సహాయత.. ప్రాణాల్ని తీసింది..!

ఈ మధ్యకాలంలో స్కూలు ఫీజులు కట్టలేని విద్యార్థులను వేధించడం పలు పాఠశాలలలో నిత్యం జరిగే తంతుగా మారిపోతోంది. 

Last Updated : Feb 3, 2018, 09:42 AM IST
స్కూలు ఫీజు కట్టలేని నిస్సహాయత.. ప్రాణాల్ని తీసింది..!

ఈ మధ్యకాలంలో స్కూలు ఫీజులు కట్టలేని విద్యార్థులను వేధించడం పలు పాఠశాలలలో నిత్యం జరిగే తంతుగా మారిపోతోంది. ఇటీవలే జరిగిన ఓ సంఘటన అందుకు అద్దం పడుతుంది. హైదరాబాద్ బోయినపల్లికి చెందిన సాయిదీప్తి స్థానిక పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంట్లో తల్లిదండ్రులు ఫీజు కట్టకపోవడంతో ఆమెను స్కూలులో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు వేధించినట్లు సమాచారం.

ఈ క్రమంలో గురువారం స్కూలు గంటలు పూర్తవ్వకుండానే ఇంటికి వచ్చిన ఆమె.. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా జరిగిన ఈ ఘటన చాలామందిని కదిలించింది. "మీరు ఫీజు కట్టలేదని.. నన్ను ఎగ్జామ్ రాయవద్దు అని చెప్పారు. అమ్మా.. నన్ను క్షమించు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని నోట్‌బుక్‌లో విద్యార్థిని రాసిన నోట్ చూడడంతో.. స్కూల్లో వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించిన ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 

అయితే స్కూలు యాజమాన్యం చెబుతున్న కథనం మాత్రం వేరేగా ఉంది. తాము ఆ విద్యార్థినిని ఏ విధంగానూ స్కూలు ఫీజు కట్టమని వేధించలేదని.. ఒంట్లో బాగా లేదని చెబితే.. హాఫ్ డే లీవ్ ఇచ్చామని తెలపడం గమనార్హం. అయితే ఆర్థిక ఇబ్బందులతో స్కూలు ఫీజు చెల్లించకపోవడంతో తమ కుమార్తెను ఆ పాఠశాలలో చాలా హీనంగా చూసేవారని.. చులకన చేసి మాట్లాడేవారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఘటనపై మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. అసలు స్కూలులో ఏం జరిగిందన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నామని తెలియజేశారు.

Trending News