'ఫొని' పోతూ పోతూ భారీ నష్టాన్ని మిగిల్చింది.... వివరాలు ఇవే

ప్రచండ వేగంతో విరుచుకుపడిన  ఫొనీ తుపాను తీరప్రాంతాలను అతలాకుతలం చేసింది.

Last Updated : May 4, 2019, 10:39 AM IST
'ఫొని' పోతూ పోతూ భారీ నష్టాన్ని మిగిల్చింది.... వివరాలు ఇవే

ఒడిషాలోని పూరీ వద్ద తీరం దాటిన ఫొనీ తుపాను ప్రళయాన్ని తలపించింది. గురువారం ఉదయం 8:45 గంటలకు తీరం దాటిన తుపాను.. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులతో విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి వరకు భయపెట్టిన తుపాను పశ్చిమబెంగాల్‌ తీరం వైపు ప్రయాణించి క్రమేణా బలహీనపడింది. ఈ వ్యవధిలో అది సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టాన్ని తగ్గించగలిగినప్పటికీ.. తీవ్ర స్థాయిలో ఆస్థి నష్టం జరిగింది. ఒడిశాతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం కనిపించింది. 

ఒడిషా పరిస్థితి ఇది..

ఒడిశాలో ఎనిమిది మంది ఉసురు తీసిన ఫొని... లక్షల హెక్టార్లల్లో పంటలకు దెబ్బ తీసింది. తుపానుకు ఒడిశాలోని పూరీ, ఖుర్దా, నయాగఢ్‌, కేంద్రపడ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కటక్‌, గంజాం, జగత్సింగ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌ జిల్లాల్లో పాక్షిక ప్రభావం కనిపించింది. తుపాను ప్రభావం వల్ల భారీ పంటనష్టంతో పాటు  విద్యుత్తు, టెలీకాం సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ దిశగా పయనించి తుపాను బలహీనం పడటంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఏపీలో జరిగిన నష్టం ఇది..

ఇక ఏపీ విషయానికి వస్తే  ఫొనీ తుపాను తన ప్రతాపం ఒడిషాతో పోల్చితే ఇక్కడ తక్కవే అని చెప్పాలి. ప్రభుత్వం తీసుకున్న మందస్తు చర్యల వల్ల ప్రాణానష్టం జరగనప్పటికీ వేల ఎకరాల పంట నష్టపోయింది. అధికారుల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్రలోని 14 మండలాలు తుపాను బారిన పడ్డాయి. మొత్తం 733 గ్రామాలు తుపాను ప్రభావిత జాబితాలో ఉన్నాయి. ఇందులో సిక్కోలులో 145 గ్రామాలపై తీవ్ర నష్టం వాటిల్లింది . కాగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సుమారు 1500 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. కాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చలిగాలుల తీవ్రతకు వృద్ధురాలు చనిపోయినట్లు సమాచారం.

Trending News