తిరుమల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అవటానికి ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా చూడాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని కోరుకున్నానని ప్రముఖ సినీనటుడు, వైఎస్సార్సీపీ నేత పృథ్వీరాజ్ అన్నారు. అందుకోసం మొదటిసారిగా తాను తలనీలాలు కూడా సమర్పించుకున్నానని పృథ్వీరాజ్ తెలిపారు. మంగళవారం కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన ఉదయం సహస్ర కలశాభిషేకం, మధ్యాహ్నం కల్యాణోత్సవ సేవల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి సుపరిపాలన రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించినట్టు చెప్పారు. సంక్షేమ రాజ్యం, బడుగుబలహీన వర్గాల రాజ్యం రావాలని కోరుకుంటూ శ్రీవారిని దర్శించుకున్నట్టు వెల్లడించారు.
సుదీర్ఘ కాలంపాటు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లిన జగన్‌మోహన్ రెడ్డిపై ప్రజలకు నమ్మకం కలిగింది. ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పునే ఇచ్చారని చెబుతూ తెలుగు దేశం పార్టీ తప్పుడు సర్వేలు వెల్లడిస్తోందని పృథ్వీరాజ్ ఆరోపించారు.