ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. ఏపీలో 1423, తెలంగాణలో 1294 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు గంటముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఏపీలో నేటి పరీక్షకు సెట్ నంబరు 3 ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేయగా, తెలంగాణలో సెట్-బి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు నేటితో మొదలై మార్చి 17వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రేపటితో మొదలై మార్చి 19 వరకు జరగనున్నాయి. ఏపీలో విద్యార్థులు పరీక్షా కేంద్రాల్ని తెలుసుకునేందుకు వీలుగా 'ఐపిఈ(ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్) సెంటర్ లోకేటర్ యాప్' ను ఇంటర్మీడియేట్ బోర్డు రూపొందించింది. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించరు. పరీక్షా కేంద్రాల వద్ద తక్షణ వైద్యసేవల్ని అందించేందుకు మెడికల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున జిరాక్స్ సెంటర్లను అనుమతించేది లేదని, పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు.