Ys Jagan Bus Yatra: ఇడుపుల పాయ నుంచి ఇఛ్చాపురం వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార భేరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా 21 రోజుల తొలి విడత ప్రచారం పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పార్టీల అభ్యర్ధులు దాదాపుగా ఖరారయ్యారు. టీడీపీ-జనసేన నుంచి కొన్ని స్థానాలు, బీజేపీ 10 స్థానాల అభ్యర్ధులు ఎవరో తేలాల్సి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్ధుల్ని ప్రకటించేసింది. రేపు ఇడుపులపాయ నుంచి తొలి విడత ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టనున్న యాత్ర రేపు మద్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది.
రేపు తొలి రోజు మార్చ్ 27వ తేదీ ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మద్యాహ్నం 12.20 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. మద్యాహ్నం కాస్సేపు ప్రత్యేక ప్రార్ధనల తరువాత 1.30 గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమౌతుంది. వేంపల్లి, వీఎన్ పల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభ ఉంటుంది. ఆ తరువాత దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకోనున్నారు. రాత్రికి అంటే తొలిరోజు బస ఆళ్లగడ్డలో ఉంటుంది.
సిద్ధం సభలు జరిగిన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా మిగిలిన 22 జిల్లాల్లో బస్సు యాత్ర ఉంటుంది. ప్రతి రోజూ ఒక జిల్లాలో ఉదయం వేళ వివిధ వర్గాల ప్రజలతో సమావేశం ఉంటుంది. అదే రోజు సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. అంటే రోజూ ఒక బహిరంగ సభ ఉండేలా షెడ్యూల్ చేస్తున్నారు. 21 రోజుల్లో తొలి విడత ప్రచారం బస్సు యాత్ర ముగుస్తుంది. బస్సు యాత్ర పూర్తయ్యేవరకూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల సమక్షంలోనే ఉంటారు.
మొదటి రోజు మార్చ్ 27న ఆళ్లగడ్డలో బస చేసి రెండో రోజు 28వ తేదీన ఆళ్లగడ్డ నుంచి ఎర్రగుంట్ల మీదుగా పాణ్యం, ఓర్వకల్లు దాటుకుని కర్నూల్ క్రాస్ మీదుగా నాగలాపురం చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక మూడోరోజు మార్చ్ 29వ తేదీన కొత్తూరు మీదుగా ఎమ్మిగనూరు చేరుకుంటారు. అక్కడ్నించి ఆదోని బైపాస్ మీదుగా పత్తికొండ క్రాస్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇలా వైఎస్ జగన్ బస్సు యాత్ర తొలి మూడు రోజుల షెడ్యూల్ ఖరారైంది.
Also read: Sajjala on NDA Alliance: ఎన్డీయేలో ఆహ్వానం ఎప్పుడో వచ్చింది, అందుకే చేరలేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook