అమరావతి: ఇటీవల కాలంలో వరుస తుఫాన్‌లు ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలను వణికిస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏర్పడిన ‘పెథాయ్’ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సర్కార్ అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఈ తుఫాన్ కారణంగా గంటకు 45-55 కిమీ వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు తీర ప్రాంతాల్లో గంటకు 65 కిమీ వేగంతో సైతం గాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు. తుఫాను ప్రభావంపై పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేట తుఫాన్ సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్‌లో అందుబాటులో ఉండాల‌్సిందిగా ఆదేశించారు. సంబంధిత అధికారులు ఒకరికొకరు పరస్పరం ఆర్టీజీఎస్‌తో సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు.
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏర్పడిన తుఫాన్ ఆంధ్రా, తమిళనాడు తీర ప్రాంతాలవైపు కదులుతోందని, తుఫాన్ ప్రభావంతో రానున్న 72 గంటల్లో ఆంధ్రా, తమిళనాడు తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్‌కే అధికారులు పెథాయ్ అని నామకరణం చేశారు.
ఏపీని వణికిస్తున్న పెథాయ్ తుఫాన్