Ycp vs Prashant kishor: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమి ఖాయమంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చవని, ఈసారి తెలుగుదేశం-జనసేన విజయం తధ్యమని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ నుంచి దుమారం రేగుతోంది. వైపీసీ నేతలు పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్‌లు మండిపడుతున్నారు.
రాష్ట్రంలో సర్వే టీమ్‌లు లేని ప్రశాంత్ కిశోర్ నగదు బదిలీకు ఓట్లు పడవని ఎలా చెబుతారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అభివృద్ధి లేకపోతే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం గత ఐదేళ్లుగా ఎలా ముందుకెళ్తున్నాయని నిలదీశారు. ఈ మధ్యకాలంలో పలుసార్లు చంద్రబాబును పీకే రహస్యంగా కలిసిన మాట నిజం కాదా అని అడిగారు. ఓ పీకే సరిపోలేదని మరో పీకేను తెచ్చుకుంటున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. బీహార్ రాష్ట్రంలో విలువలేని వ్యక్తి ఇక్కడి పరిస్థితుల గురించి ఎలా మాట్లాడతాడని మండిపడ్డారు. పీకే ఓ రాజకీయ భిక్షగాడని ఎద్దేవా చేశారు.
మరోవైపు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా ప్రశాంత్ కిశోర్‌పై మండిపడ్డారు. మాంత్రికుడనుకున్న పీకే సొంత రాష్ట్రంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. బీహార్‌లో చెల్లని నాణెం ఇక్కడెలా చెల్లుతుందని మండిపడ్డారు. పేదలకు మేలు చేస్తూ అవినీతికి తావులేకుండా సంక్షేమ పధకాలు అందిస్తున్న జగన్‌కు కాకుండా అబద్ధపు అడ్డగోలు హామీలిచ్చే చంద్రబాబుకు ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. సంక్షేమం ఓట్లు రాల్చదన్నప్పుడు, చంద్రబాబే గెలుస్తాడని అనుకున్నప్పుడు సంక్షేమంపై ఎడాపెడా హామీలివ్వాలని ప్రశాంత్ కిశోర్ చంద్రబాబుకు సలహా ఎలా ఇచ్చారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విరుచుకుపడ్డారు.
బీహార్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఏపీలో కొన్ని కాసులైనా ఏరుకుందామని చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఎందరు పీకేలు వచ్చినా ఏపీ ప్రజలు తిప్పికొడతారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. ఒక్క ప్రకటనతో ప్రజల నాడి మార్చేయవచ్చని, తానొక మాంత్రికుడనే భ్రమలో ఉన్న ప్రశాంత్ కిశోర్ సొంత రాష్ట్రం బీహార్ రాజకీయాల్లో అనామకుడిగా మిగిలారని ఎద్దేవా చేశారు. అక్కడి రాజకీయాల్లో విఫలమైన వ్యక్తి ఇక్కడి రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Also read: Prashanth Kishore: వైఎస్ జగన్ ఓటమి ఖాయం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook