అమరావతి: ఏపీ కేబినెట్ కూర్పు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రానికి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించనున్నట్టు వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు స్పష్టంచేశారు. వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు సహా మొత్తం 25 మందితో ఏపీ నూతన కేబినెట్ రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది.
నేడు జరిగిన వైఎస్సార్సీపీఎల్పీ సమావేశం అనంతరం పార్టీ ఎమ్మెల్యే ఎంఎం షేక్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రాకు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు నియమితులనుండటం తమను ఎంతో ఆనందానికి గురిచేస్తోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ, కాపు వర్గాల నుంచి ఒక్కో ఉప ముఖ్యమంత్రి చొప్పున మొత్తం ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు నియమితులు కానున్నారని చెబుతూ.. తమ ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ దేశంలోనే ఉత్తమమైన ముఖ్యమంత్రి అని నిరూపించుకుంటారని విశ్వాసం వ్యక్తంచేశారు.