ఏపీ ఎంసెట్ 2018 కౌన్సెలింగ్ ప్రక్రియకి సంబంధించిన ప్రకటన నేడే వెలువడనుంది. ఈ కౌన్సిలింగ్‌లో భాగంగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల వివరాలను నమోదు చేయకపోతే వారికి ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సమాచారాన్ని పంపిస్తారు. ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ప్రవేశాల కోసం www.apeamcet.nic.in వెబ్ సైట్ ద్వారా ప్రాసెసింగ్ రుసుము (ఓసీ, బీసీ అభ్యర్థులైతే రూ.1200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే రూ.600) చెల్లించాలి.
డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఆ రుసుము చెల్లించవచ్చు. రుసుము చెల్లించిన అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ నెంబరు ఇవ్వడం జరుగుతుంది. అదే నెంబరు అభ్యర్థుల ఫోన్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబరు వెబ్ సైటులో నమోదు చేశాక.. మీ ధ్రువీకరణ పత్రాల తనిఖీ పూర్తయితే... ఆ ప్రక్రియ పూర్తయినట్లు స్క్రీన్ పై సందేశం వస్తుంది.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు.. వివరాల్లో తప్పులుంటే వెంటనే మీ జిల్లాకి సమీపంలో ఉండే సహాయ కేంద్రానికి వెళ్లి వాటిని మార్చుకోవలసి ఉంటుంది. విద్యార్థి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశాక, లాగిన్ ఐడి, పాస్ వర్డు జనరేట్ చేసుకోవాలి. వాటికి అనుబంధంగా హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేది వివరాలు కూడా ఇవ్వాలి. ఒకసారి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రకటన వెలువడ్డాక ఈ నెల 28 నుండి 30వ తేది వరకు అభ్యర్థులు రుసుము చెల్లించి, సర్టిఫికెట్ల వెరిఫికేషను ప్రక్రియను, రిజిస్ట్రేషను ప్రక్రియను పూర్తిచేసుకోవాలి.
ఈ నెల 30 తేది నుండి 31 తేది వరకు 1 నుంచి 60 వేల ర్యాంకులు పొందిన విద్యార్థులు ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. జూన్ 1, 2 తేదిల్లో 60,000 నుంచి చివరి ర్యాంకు పొందిన విద్యార్థి వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 3వ తేదిన విద్యార్థులు ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చు. 5వ తేదిన సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది.
స్పోర్ట్స్ కోటా, ఎన్‌సీసీ విభాగంలో సీట్లు పొందే విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు.
ఇవే సహాయ కేంద్రాలు: విశాఖపట్నం (ఆంధ్రా యూనివర్సిటీ), కాకినాడ (జేఎన్‌టీయూ), గుంటూరు (నాగార్జున యూనివర్సీటీ), తిరుపతి (ఎస్వీయు), అనంతపురం (జేఎన్‌టీయూ), కర్నూలు (రాయలసీమ వర్సీటీ), కడప (యోగి వేమన వర్సిటీ), విజయవాడ (ఆంధ్రా లయోలా కాలేజీ), విజయవాడ (సీవీఆర్ కాలేజీ).
నేడు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రకటన