AP Farmers' Paddy Loss: ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు

AP Govt's Good News to Farmers: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చేపట్టిన ఇతరత్రా చర్యలను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 

Written by - Pavan | Last Updated : May 5, 2023, 04:47 AM IST
AP Farmers' Paddy Loss: ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు

AP Govt's Good News to Farmers: అమరావతి: ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాల వల్ల రంగుమారిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఏపీ సీఎం వైయస్ జగన్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో అకాల వర్షాల అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో ఏపీ సీఎం వైయస్‌.జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాల కారణంగా పంట నష్టం తదితర అంశాలపై అధికారులు అందించిన ప్రాథమిక వివరాలను పరిశీలించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదన్న చెడ్డపేరు రాకూడదని సీఎం జగన్ అధికారులకు స్పష్టంచేశారు. వర్షాల వల్ల రంగుమారిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, ఇది పూర్తిస్థాయిలో జరగాలని సీఎం స్పష్టంచేశారు. వర్షాల వల్ల రైతులకు కలిగిన పంట నష్టం సహా ఇతర నష్టాలకు సంబంధించి గ్రామ సచివాలయాల స్థాయి నుంచే నిరంతరం వివరాలు తెప్పించుకోవాలని సూచించారు. ఎన్యుమరేషన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీకోసం పెట్టాలని తెలిపారు.

ఒకవేళ ఎవరైనా రైతులు మిగిలిపోయినట్టయితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు ఈ సామాజిక తనిఖి ఉపయోగపడుతుందని.. రబీ సీజన్‌కు ధాన్యం కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదులు చేయడానికి, ట్రోల్‌ ఫ్రీ నెంబరుని కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించేలా అధికారుల చర్యలు ఉండాలని స్పష్టంచేశారు. రానున్న రోజుల్లో కూడా వాతావరణ పరిస్థితులపై వివరాలు ఎప్పకప్పుడు తెప్పించుకుని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చేపట్టిన ఇతరత్రా చర్యలను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇప్పటికే 4.75లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని అన్నారు. అలాగే పంట కోసిన చోట పనలు తడిసిన ప్రాంతాల్లో ఉప్పు ద్రావణం చల్లడం లాంటి విధానాలను పాటించడంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పంట కోయని ప్రాంతాల్లో ఏం చేయాలన్న దానిపై రైతులకు సూచనలు చేస్తున్నామని అన్నారు. అన్ని జిల్లాలకు కూడా ఒక వ్యవసాయశాస్త్రవేత్తను అందుబాటులో ఉంచి స్థానిక అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇది కూడా చదవండి : YSR Kalyanamastu Scheme: నేడే లబ్ధిదారుల ఖాతాల్లోకి వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా

వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద, ఆర్బీకేల వద్ద, రైతుల వద్ద ఉన్న ధాన్యం నిల్వలను భద్రంగా ప్రభుత్వ భవనాలు, గోడౌన్లలోకి పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్క జొన్న కొనుగోలు కూడా ఊపందుకుందన్న అధికారులు.. అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్స్‌ తెరిచామని, అధికార యంత్రాంగం అంతా ప్రజలకు అందుబాటులో ఉందని తెలిపారు. రాబోయే వారం రోజుల్లో మోచ తుపాన్ వచ్చే ప్రమాదం ఉండటంతో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉన్నామని అధికారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు.

ఇది కూడా చదవండి : Cyclone Mocha News: ఏపీకి మరో గండం.. ముంచుకొస్తున్న 'మోచా' తుపాను ముప్పు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News