ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవనాలు పరిశీలించేందుకు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు నేలపాడు సమీపంలోని నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీ భవనాలను పరిశీలించారు.అలాగే గన్నవరంలోని వెటర్నరీ విశ్వవిద్యాలయం భవనాలను కూడా కమిటీ సందర్శించింది.
అయితే ఈ భవానాలేవీ హైకోర్టు కార్యక్రమాల నిర్వహణకు సరిపోవని కమిటీ భావించిన్నట్లు సమాచారం. ముఖ్యంగా పార్కింగ్ సమస్య ఈ భవనాలకు ఉండడం వల్ల కమిటీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయినా సరే ఏదో విధంగా అక్కడ హైకోర్టుని సర్దుబాటు చేసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
ప్రస్తుతానికి తాత్కాలిక హైకోర్టును నేలపాడులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తర్వాత శాశ్వత హైకోర్టు నిర్మాణం గురించి ఆలోచిస్తే మంచిదని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఇలా ఉండగా.. తాత్కాలిక హైకోర్టును రాయలసీమలోని కర్నూలులో ఏర్పాటు చేయాలని.. ఆ ప్రాంతం నుండి వచ్చిన పలువురు న్యాయవాదులు కమిటీకి వినతిపత్రం అందజేశారు.