ఇంగ్లీష్ మీడియంపై ఏపీ మంత్రి తాజా ప్రకటన

ఇంగ్లీష్ మీడియంపై ఏపీ మంత్రి తాజా ప్రకటన

Updated: Nov 18, 2019, 08:00 PM IST
ఇంగ్లీష్ మీడియంపై ఏపీ మంత్రి తాజా ప్రకటన

అమరావతి: నేటి పోటీ ప్రపంచంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం ఎంత అవసరమో ముఖ్యమంత్రి చాలా చక్కగా ప్రజలకు వివరించి చెప్పిన తర్వాత కూడా ఇంగ్లీష్ మీడియం అమలుపై కొన్ని రాజకీయ పార్టీలు, పత్రికలు విషం చిమ్ముతున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆంగ్ల మాద్యమం వల్ల ఎస్టీ, ఎస్సి, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలకు మేలు జరుగుతుందన్న ఆయన.. అటువంటి ఇంగ్లీష్ మీడియంను ఒక కులానికో లేక ఒక మతానికో ముడి పెట్టడం సరికాదని అన్నారు. ఇంగ్లీష్ భాష అమలుకు మతపరమైన వివాదాన్ని తీసుకురావడం బాధాకరమని ప్రతిపక్షాలపై అసంతృప్తి వ్యక్తంచేసిన మంత్రి సురేష్.. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారందరూ తమ మతం మార్చుకున్నారా అని ప్రశ్నించారు.

ఇంగ్లీష్ మీడియం అమలు ప్రణాళికలపై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ముందుగా 68 వేల మంది ఉపాద్యాయులకు బోధనలో తర్ఫీదు ఇవాల్సి ఉందని అన్నారు. అందుకోసం ఇఫ్లూ సహా ఇతర ఇంగ్లీష్ విద్యా సంస్థలతో ఎంవోయూ చేసుకుంటామని తెలిపారు. అలాగే ఇంగ్లీష్ మీడియం అమలుకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనపైనా ప్రభుత్వం దృష్టిసారించినట్టు మంత్రి వెల్లడించారు. ఏదేమైనా.. రైట్ టు ఇంగ్లీషు మీడియం విధానంతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మరోసారి స్పష్టంచేసిన మంత్రి సురేష్.. కార్పొరేట్ కాలేజీల ఫీజులపైనా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు.